నూతనోత్సాహం


Sat,September 8, 2018 11:47 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్తకొండ ఈరన్న కొలువుదీరిన నేల...టీఆర్‌ఎస్ పార్టీకి సెంటిమెంట్ నేల.. శ్రావణ శుక్రవారం రోజు హుస్నాబాద్ గడ్డపై నిర్వహించిన ఆశీర్వాద సభకు తండోప తండాలుగా పిల్లాజల్లాతో.. వివిధ కులవృత్తుల వేషధారణలు.. గిరిజనుల నృత్యాలు.. గొల్లకుర్మల డిల్లెం బల్లెం...ఇలా సబ్బండవర్ణాల ప్రజలు సమూహంగా తరలివచ్చి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌పై ఉన్న తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు నిండు మనస్సుతో సభను ఆశీర్వదించి పంపడంతో టీఆర్‌ఎస్ పార్టీ మంచి జోష్‌లో ఉంది. ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నది.. శాసనసభ రద్దు తర్వాత ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడంతో ఈ సభకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయడంలో ట్రబుల్ షూటర్, అరడుగుల బుల్లెట్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పక్కా ప్రణాళికలు.. వ్యూహాలతో సక్సెస్ అయ్యారు. సభ సక్సెస్ కావడంతో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

సభ విజయవంతానికి మూడు రోజుల సమయంలోనే అనుకున్న లక్ష్యానికి మించి రెట్టింపు స్థాయిలో జనాన్ని తరలించి సభ సక్సెస్ కావడం మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చాటింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు అక్కడే ఉండి అన్నీ తానై చూసుకున్నారు. నియోజకవర్గంలోని 7 మండలాలు, మున్సిపాలిటీలకు ఎమ్మెల్యేలను, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారు. హుస్నాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా మొదటి సభను నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్‌లతో పాటు శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మూడు రోజులపాటు గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మహిళా నాయకులు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించారు. ఇలా అన్ని వర్గాలను సమన్వయం చేయడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మొదటగా 50వేలతో సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భావించినప్పటికీ అంతకు రెట్టింపులో జనం వచ్చి సభాస్థలి నిండి రోడ్లపైనే నిలబడి సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. సుమారుగా 70వేల వరకు జనం తరలివచ్చారు. భారీ జనం రావడంతో హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నది. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో యుద్ధానికి బయలుదేరుతున్న అని సీఎం కేసీఆర్ అనడంతో ప్రజలు నిండు మనస్సుతో సభ మొత్తం ఆశీర్వదించింది. 35 నిమిషాల పాటు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

అభివృద్ధి మీ కండ్ల ముందు ఉంది.. మీ నాయకుడు.. మీ ఎమ్మెల్యే చేసిన పనులు మీ ముందే ఉన్నాయి. మరొక సారి ఆశీర్వదించి పంపండి.. నేనే స్వయంగా వచ్చి హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను.. రాష్ట్రంలోనే నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ అనడంతో సభలోని జనం జేజేలు పలికారు. మా ఎమ్యెల్యేను భారీ మెజార్టీతో గెలిపిస్తామంటూ నినదించింది. గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి లక్షా 50 వేల ఎకరాలకు పైచిలుకుగా సాగు నీరందించి ఈ ప్రాం తాన్ని పచ్చబడేలా చేస్తానని సీఎం చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.

మంత్రి హరీశ్‌రావు పక్కా వ్యూహంతో సభ సక్సెస్
టీఆర్‌ఎస్ పార్టీ మొట్టమొదటి ప్రజా ఆశీర్వాద సభను మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించింది. ఈ సభ నిర్వహణ బాధ్యతను భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. మూడు రోజుల వ్యవధిలోనే సభను సక్సెస్ చేయాలన్న సంకల్పంతో రంగంలోకి దిగి పక్కా ప్రణాళికను, వ్యూహాన్ని రచించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆయా మండలాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. ప్రతి గ్రామానికి టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పంపించి మూడు రోజుల పాటు ఆ గ్రామంలో ఉండి అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించారు. మంత్రి హరీశ్‌రావు నాయకులతో ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ దిశా నిర్దేశం చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉండగా, 12 గంటల నుంచే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. నిర్దేశించిన సమయానికే సభా ప్రాంగణం నిండిపోయింది. సీఎం కేసీఆర్ సాయంత్రం 4 : 45 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ చేరుకోగానే సభ కేరింతలతో ఉర్రూతలూగింది. 35 నిమిషాల పాటు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మొత్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సభా సక్సెస్ వెనుక మంత్రి హరీశ్‌రావు వ్యూహం ఫలించింది. తొలి సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ మంచి జోష్‌తో ఉరకలు వేస్తున్నది. ఎన్నికల్లో సతీశ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమైపోయింది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...