పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు


Fri,December 13, 2019 10:35 PM

సంగారెడ్డి చౌరస్తా: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆడుతూపాడుతూ విద్యనభ్యసించిన పది విద్యార్థులు కాస్తా స్పీడ్‌ పెంచారు. రాత్రింభవళ్లు తమ పుస్తకాలతో సమయాన్ని గడుపుతున్నారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ప్రణాళికను పాటిస్తూ చదువులను కొనసాగిస్తున్నారు. అటు ఉపాధ్యాయులు కూడా ఒక్కో విద్యార్థిని దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉదయం, సాయం వేళలో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విద్యార్థులతో మాట్లాడుతూ వారి అభ్యాసనం గురించి ఆరా తీస్తుండగా, అటు విద్యార్థులు సైతం తమ ఉపాధ్యాయులకు ఫోన్‌ చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలను సాధించేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నది. జిల్లాలోని మొత్తం 466 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 21,964 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నమోదైన 128 మంది ప్రైవేటు విద్యార్థులు కూడా పరీక్ష రాయనున్నారు. అయితే ప్రైవేటు విద్యార్థులు ఇంకా నమోదవుతున్నందున ఈ నెలాఖరుకు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో జిల్లాలో పది పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులకు చదువు స్పీడ్‌ను పెంచారు. వచ్చే ఏడాది మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు దాదాపు 100 రోజుల గడువు మాత్రమే ఉన్నందున విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం పాఠశాల నిర్వహణకు ముందు 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, అదేవిధంగా పాఠశాల నిర్వహణ అనంతరం అనగా సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు మొత్తం రెండు గంటల పాటు ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రతి ఆదివారం వారాంతం పరీక్షలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఏ రోజు ఏ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారో కూడా విద్యార్థులకు ముందుగానే షెడ్యూలును ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వారం రెండు సబ్జెక్టుల చొప్పున పరీక్షలను నిర్వహించి మరుసటి రోజు సోమవారం ఆ సబ్జెక్టుల మూల్యాంకనం కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో ఏ సబ్జెక్టులో విద్యార్థి వెనుకంజలో ఉన్నాడో ఆ సబ్జెక్టులో విద్యార్థి రాణించేలా కృషి చేస్తున్నారు. వీటితో పాటు కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని దత్తత తీసుకున్నారు. వారు దత్తత తీసుకున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు ముందు, ఆ తరువాత విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు ఫోన్‌ చేసి అభ్యసనం వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు సైతం తమ ఉపాధ్యాయులకు ఫోన్‌ చేసి ఆయా సబ్జెక్టుల అభ్యసనంపై మాట్లాడడం విశేషం.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...