ఆరోగ్యమే.. మహభాగ్యం


Wed,November 20, 2019 12:47 AM

-సంపూర్ణ ఆరోగ్య జిల్లా వైపు అడుగులు
-గ్రామ ఆరోగ్య వేదికతో అందరికీ పరీక్షలు
-అన్ని రకాల పరీక్షలతోపాటు పారిశుధ్యంపై అవగాహన
-స్కూలు, హాస్టళ్ల విద్యార్థులకు కూడా ఆరోగ్య పరీక్షలు
-కలెక్టర్ చొరవతో గ్రామాల్లో కొనసాగుతున్న కొత్త కార్యక్రమం
-గత నెల 19న ఆరోగ్య వేదిక ప్రారంభం
-ఇప్పటి వరకు 247 గ్రామాల్లో వైద్య శిబిరాలు
-20వేల మందికి వైద్య పరీక్షలు పూర్తి
-1100 మంది బడి పిల్లలకు తక్కువ శాతం హిమోగ్లోబిన్
-20 మంది పిల్లలకు అధిక, 150 మందికి మోస్తారు రక్తహీనత
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: జిల్లా సంపూర్ణ ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తున్నది. ఆరోగ్య జిల్లాగా మార్చడమే లక్ష్యంగా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు చేయించి ముందుగానే అనారోగ్య సమస్యలు గుర్తించి జాగ్రత్త పడడంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగానే గత నెల అక్టోబర్ 19తేదీన గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 247 గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్నిరకాల పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ద్వారా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు బయటపడుతున్నాయి. టీబీ, కుష్ఠి, హెచ్‌ఐవీ ఇలా అన్నిరకాల పరీక్షలు ఈ శిబిరాలు ద్వారా నిర్వహిస్తున్నారు. ఉచితంగా పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి చికిత్సలు అందిస్తుండడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు 20వేల మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ పరీక్షలు పూరి చేసే వరకు కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్ అంటున్నారు..

అందరికీ అన్ని రకాల పరీక్షలు..
ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం గ్రామ ఆరోగ్య వేదికలు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 15లక్షల వరకు జనాభా ఉన్న విషయం తెలిసిందే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు అక్టోబర్ 19తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారంలో మూడు రోజులపాటు వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా, ఇప్పటి వరకు 247 గ్రామాల్లో వైద్య శిబిరాలు పూర్తి చేశారు. టీబీ, లెప్రసీ, హెచ్‌ఐవీ, రక్తపోటు, మధుమేహంతోపాటు అన్నిరకాల పరీక్షలు చేస్తున్నారు. జ్వరం ఇతర చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు అక్కడికక్కడే మందులు అందిస్తున్నారు. జిల్లా దవాఖానకు తరలించి ఇతర వైద్య సేవలందిస్తున్నారు. ప్రతిఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వచ్చిన అందరికీ పరీక్షలు చేస్తున్నారు.

పారిశుధ్యంపై అవగాహన కూడా..
వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు పారిశుధ్యంపై గ్రామ సభల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం మూడు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రతినెలా 1వ, 11వ, 21వ రోజుల్లో గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ ద్వారానే మురుగు కాల్వలు, మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండే కాలనీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయా కాలనీల్లోనే గ్రామసభలు ఏర్పాటు చేసి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వచ్చే వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. మురుగు కాల్వలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తున్నాయని, అప్రమత్తతో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 30రోజుల ప్రణాళికతో గ్రామాలు బాగైన విషయం తెలిసిందే. గ్రామాల్లో డ్రైడే, మొక్కలు నాటడం, శ్రమదానం, హ్యాండ్ వాష్, లైఫ్ ైస్టెల్ వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అన్ని శాఖల సమన్వయంతో..
అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకుంటున్నారు. వారి పర్యవేక్షణలోనే ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. పంచాయత్‌రాజ్, వాటర్ వర్క్స్, వైద్యఆరోగ్య, ఐసీడీఎస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయడంతో వైద్య శిబిరాలు విజయవంతమవుతున్నాయి. ప్రజలకు ముందస్తు సమాచారం చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడానికి రెండు రోజుల ముందు నుంచే దండోరా వేయిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

20వేల మందికి పరీక్షలు..
అక్టోబర్ 19తేదీన జిల్లాలో ఆరోగ్య వేదిక కార్యక్రమం మొదలుకాగా, ఇప్పటి వరకు 20వేల మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది వైరల్ ఫీవర్, ఇతర జ్వరాలతో బాధపడుతున్నట్లు పరీక్షలు వెల్లడిస్తున్నాయి. దీనితో అందరికీ వైద్య సిబ్బంది మందులు అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలతోపాటు ఆ గ్రామ పరిధిలోని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, 247గ్రామాల్లో 20వేల మందికి పరీక్షలు జరిపితే ఇందులో 1300 మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అలాగే, 800కి మధుమేహం (డయాబెటిస్), 1100 మంది పాఠశాల విద్యార్థులకు రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నట్లు పరీక్ష ద్వారా గుర్తించారు. 20మంది పిల్లలకు తీవ్రమైన రక్తహహీనత (ఎనిమియా) ఉన్నట్లు గుర్తించి రక్తమార్పిడికి రెఫర్ చేశారు. మరో 150మంది పిల్లలకు రక్తహీనత ఉన్నట్లు గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు. 5నుంచి 10 తరగతి చదువుకుంటున్న 2500 మంది విద్యార్థులకు టీడీ(టెటానస్) వాక్సిన్ ఇచ్చినట్లు వైద్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...