వైమానిక దళంలో చేరండి


Wed,November 20, 2019 12:44 AM

సంగారెడ్డి చౌరస్తా : భారత వైమానిక దళంలో చేరేందుకు యువత ముందుకు రావాలని కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సికిందరాబాద్ ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ అధికారి యోగేశ్ మొహాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో యువత వైమానిక దళంలో చేరేందుకు అవకాశం వచ్చిందన్నారు. ర్యాలీ ఏర్పాటుకు కనీస మౌలిక సదుపాయాలు అయిన టెంటు, కుర్చీలు, బల్లలు, విద్యుత్, తాగునీరు, వాష్ రూమ్స్, పోలీస్ బందోబస్తు వంటివి ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా నుంచి వైమానికదళంలో యువత పెద్ద ఎత్తున ఎంపిక జరిగేలా చైతన్యపర్చడంతో పాటు జిల్లా యంత్రాంగం తరపున 10 నుంచి 15 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు యోచిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు.

జనవరి 16 నుంచి ర్యాలీ..
వింగ్ కమాండింగ్ అధికారి యోగేశ్ మొహాల మాట్లాడుతూ వచ్చే జనవరి 16 నుంచి 21 వరకు పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్, ఆటో టెక్నిషియన్ పోస్టులలో నియామకం ఉంటుందని వివరించారు. అయితే అభ్యర్థులు 19 జనవరి 2000 నుంచి 1 జనవరి 2004 మధ్య జన్మించిన వారై, ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఆంగ్లంలో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని, ఆటో టెక్నిషియన్‌కు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుందన్నారు. శారీరక దారుఢ్య పరీక్షలతో పాటు రీడింగ్, మెంటలెబిలిటి పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు కనీసం ఆరు మాసాల నుంచి ఏడాది పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ కాలంలో ైస్టెఫండ్ ఇస్తామన్నారు. ఉద్యోగంలో చేరిన అనంతరం రూ.21,700 మూలవేతనంతో పాటు ఇతర భత్యాలు కలిపి సుమారు రూ.30వేలకు పైగా ప్రారంభ వేతనం వస్తుందని వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించి త్వరలో ఎంప్లాయింమెంట్ ఎక్సెంజీలో నోటిఫికేషన్ వస్తుందని లేదా www.airmenselection.cdac.in వెబ్‌సైట్ చూడవచ్చని వింగ్ కమాండర్ స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుల్తాన్‌పూర్‌లో జరిగే వైమానిక దళ ర్యాలీకి యువత పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, యువజన క్రీడల అధికారి రాందచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...