సర్కారు వృత్తిదారులకు అండ


Mon,November 18, 2019 11:49 PM

-మత్య్సకారుల అభ్యున్నతికి 15,500 చెరువుల్లో చేప పిల్లలు విడుదల
-వంద శాతం సబ్సిడీపై 62 కోట్ల చేప పిల్లలు అందజేశాం...
-24 రిజర్వాయర్లతో పాటు జిల్లాకు రెండు చెరువుల్లో రొయ్యల పిల్లల విడుదల...
-మత్య్సకారులు ఆర్థికంగా ఎదుగాలి..
-మార్కెట్‌లో నేరుగా చేపలు, రొయ్యలను విక్రయించుకోవాలి...
-రాష్ట్ర మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ
-అందోలు పెద్ద చెరువు, సింగూరు డ్యాంలో చేప, రొయ్య పిల్లలు విడుదల

అందోల్‌, నమస్తే తెలంగాణ : కుల వృత్తిదారులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వా రు అర్థికంగా ఎదిగేందుకు మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీతో చేప పిల్లల్ని, రొయ్య పిల్లల్ని అందిస్తుందని రాష్ట్ర మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 సంవత్సరానికి గాను 15,500 చెరువుల్లో 62 కోట్ల చేప పిల్లల్ని వదిలామని ఆయన తెలిపారు. సోమవారం అందోలు పెద్ద చెరువులోని రొయ్య పిల్లల విడుదల కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్య్సకారులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయూతనందిస్తూ, వారిని అర్థికంగా అభివృద్ధి పరిచేందుకు వంద శాతం రాయితీపై చేప పిల్లలను ప్రతి ఏడాది చెరువుల్లో వదులుతుందన్నారు. నాలుగేండ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్య్సకారుల అభ్యున్నతి కోసం చేప పిల్లలను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపడుతుందని, దీని వలన మత్య్సకారులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందన్నారు. చెరువు విస్తీర్ణంలో 1/3 వ వంతు నీరు కలిగిన చెరువుల వివరాలను ఇరిగేషన్‌ శాఖ, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా నివేదికను తీసుకుని, వాటిలో చేప పిల్లల్ని వదిలినట్లు ఆయన తెలిపారు.

చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను పెంచడం వలన మత్య్సకారులకు అధిక లాభాలు వస్తాయన్న ఆలోచనతో రెండేండ్లల్లో 11 రిజర్వాయర్లను గుర్తించి, వాటిలో ప్రయోగత్మాకంగా రొయ్య పిల్లల్ని వంద శాతం సబ్సిడీపై వదిలామని, రొయ్యల పెంపకం సక్సెస్‌ కావడం, మత్య్సకారులకు అధిక లాభాలు వచ్చాయన్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 24 రిజర్వాయర్లలో రొయ్య పిల్లల్ని వేశామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుజాత, జడ్పీటీసీ రమేశ్‌, జిల్లా మత్య్స సహకార సంఘం అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీపీ బాలయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, మాజీ వార్డు మెంబర్‌ ఉల్వల వెంకటేశం, నాయకులు శంకర్‌ యాదవ్‌, నాగరత్నంగౌడ్‌, నాగరాజ్‌, భూమయ్య, జోగిపేట చేపల సంఘం అధ్యక్షుడు నాగరాజ్‌ సభ్యులు యాదగిరి, దశరత్‌, శ్రీనివాస్‌, కిషోర్‌, జోగయ్య, సంతోశ్‌, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 10.50 లక్షల రొయ్యల పెంపకం..
2019-20 సంవత్సరంలో రిజర్వార్లతో పాటు జిల్లాకు రెండు పెద్ద చెరువులను గుర్తించి, వాటిలో రొయ్య పిల్లలను వేసి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా 10.50 లక్షల రొయ్య పిల్లలను చెరువులు, ప్రాజెక్టులో వేశామన్నారు. సింగూర్‌లో 3.55 లక్షలు, నల్లవాగులో 5.50 లక్షలు, అందోలు పెద్ద చెరువులో 50 వేలు, బోగులంపల్లిలో 95 వేల రొయ్య పిల్లలను వదిలినట్లు ఆయన వెల్లడించారు. వీటి పెరుగుదల వచ్చే మార్చి వరకు 30 నుంచి 40 గ్రాముల వరకు ఎదుగుతాయని, మత్య్సకారులకు 3 నుంచి 4 నాలుగు మాసాల వరకు ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది వరకు రొయ్యలను చెరువులోనే ఉంచినట్లయితే, 250 గ్రాములకు పైగా పెరుగుతాయని ఆయన తెలిపారు.

దళారులకు చేపలు, రొయ్యలను అమ్మొద్దు..
మత్య్సకారులను అర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలు, రొయ్య పిల్లలు పెరిగిన తర్వాత వాటిని దళారులకు, వ్యాపారులకు విక్రయించకూడదని రాష్ట్ర మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ సూచించారు. మత్య్సకారులు చేపలు, రోయ్యలను పట్టుకుని మార్కెట్‌లో నేరుగా విక్రయించాలని, తద్వారా అధిక లాభాలు వస్తాయని, ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మత్య్సకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మత్స్యకారులకు రాయితీలు..
పుల్కల్‌ : మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను ఇవ్వడమే కాకుండా, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. సింగూర్‌ ప్రాజెక్టులో సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను, రొయ్య పిల్లలను ఎంపీపీ పట్లోళ్ల చైతన్యరెడ్డితో కలిసి వదిలారు. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉండడంతో కేవలం 3 లక్షల 60 వేల చేప పిల్లలను, 3 లక్షల 65 వేల రొయ్య పిల్లలను వదిలామని చెప్పారు. మత్స్యకారులకు చేపలను అమ్ముకోవడానికి మార్కెట్‌ సౌకర్యం కల్పించామనన్నారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు ద్విచక్రవాహనాలను రాయితీపై పంపిణీ చేసి, రూ.10 వేల రాయితీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్య సహకార సంఘం లైసెన్స్‌ ఆధారంగా ద్విచక్రవాహనాలకు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చామన్నారు. చేపలు విక్రయించడానికి గుడారాలు, ఐస్‌ డబ్బా, తూకం వేయడానికి కాంట వంటిని అందజేశామన్నారు. సింగూర్‌ డ్యాంలో చేపలు పట్టుకొని వేల మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారన్నారు. మంజీరా తీరం వెంబడి ప్రతి గ్రామంలో మ్సత్స్య సహకార సంఘాలున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుజాత. రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సర్సింహారెడ్డి, ముదిమాణిక్యం పీఏసీఎస్‌ చైర్మన్‌ పడమటి రమేశ్‌, సుల్తాన్‌పూర్‌ ఎంపీటీసీ మాణిక్‌రెడ్డి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు టేకు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...