అబ్దుల్ కలాం స్ఫూర్తితో పరిశోధనలు చేయాలి


Fri,November 15, 2019 11:34 PM

-విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
-పటాన్‌చెరులో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభం

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : ప్రతిభ కలిగిన విద్యార్థులకు తెలంగాణలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఫాదర్ స్కూల్‌లో జిల్లా స్థాయి జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్- 2019ను ఎమ్మెల్యే డీఈవో విజయలక్ష్మితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సుస్టేనబుల్ డెవలప్‌మెంట్ పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతిభ కలిగిన చిన్నారులను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువాలని ఆకాంక్షించారు. సైన్స్, టెక్నాలజీ విభాగంలో ఎన్నో రకాల పరిశోధక అంశాలుంటాయన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు వసతులను కల్పించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లు గతంలో కూడా బీహెచ్‌ఈఎల్‌లో ఏర్పాటు చేసి విజయవంతం చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులు కూడా చక్కటి ఆలోచనలను అవిష్కరిస్తున్నారని కొనియాడారు. ఈ సైన్స్ ఫెయిర్‌నుంచి రాష్ట్రస్థాయికి పలువురు వెళ్లాలని కోరుకున్నారు. ఇప్పటికే రూ.5కోట్ల వరకు ఖర్చు చేసి క్రీడా స్టేడియాలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

విద్యార్థుల్లో ప్రతిభ అపారం : డీఈవో విజయలక్ష్మి
జిల్లాలో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ అపారమని డీఈవో విజయలక్ష్మి అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో అనేక ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. ఒకరిని మించి ఒకరు తాము తయారు చేసిన పరికరాలను ప్రదర్శిస్తున్నారన్నారు. విజ్ఞానం పెంచేలా వైజ్ఞానిక ప్రదర్శన ఉందన్నారు. జిల్లా స్థాయిలో మెరికల్లాంటి సైన్స్, మాథ్స్, ఇతర సబెక్ట్ విద్యార్థులు తమ ప్రదర్శనలతో వచ్చారన్నారు. సైన్స్‌కు అంతులేదని రోజుకో కొత్త ఆవిష్కరణ మనం చూస్తున్నామన్నారు. జిల్లా విద్యార్థులు కూడా చక్కటి ఆవిష్కరణలు చేయాలని కోరారు. విద్యతో పాటు పరిశోధన రంగం, సృజనాత్మక రంగాల్లోనూ ముందుండాలన్నారు. పాఠంలో చెప్పిన అంశాలతో రూపొందించిన ప్రాజెక్టులు విద్యార్థుల్లో త్వరగా అవగాహననను పెంచుతాయన్నారు. ఎగ్జిబిషన్‌కు చక్కటి ఏర్పాట్లు జరిగాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 1800మంది విద్యార్థులు, 515 ప్రదర్శనలు పెట్టారు. దాదాపుగా 180 పాఠశాలలు, వందమంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్‌పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, దశరథరెడ్డి, గడీల కుమార్‌గౌడ్, ఎంఈవో పీపీ రాథోడ్, విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles