దోమలతో జాగ్రత్త


Wed,November 13, 2019 01:49 AM

కోహీర్‌ : దోమలతో వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల ద్వారా మలేరియా, బోదకాలు, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు, తదితర వ్యాధులు వస్తాయి. వ్యాధులు వ్యాపించకుండా దోమలను నివారించడం, దోమ కాటు నుంచి రక్షణ పొందాలి. దోమల్లో పలు రకాలున్నాయి. ఈడిస్‌ దోమ ద్వారా డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు వస్తాయి. ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న నీటి నిల్వల్లో ఇవి పెరుగుతాయి. అనాఫిలస్‌ దోమలు మంచి నీటి నిల్వల్లో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. క్యూలెక్స్‌ దోమలు మురుగు నీటి కాల్వల్లో పెరిగి బోదకాలు, మెదడు వాపు వ్యాధులు వచ్చేందుకు కారణమవుతాయి. మాన్సోనియా మొక్కలున్న నీటి నిల్వ ప్రాంతాల్లో పెరిగి బోదవ్యాధిని కల్గిస్తాయి. అర్మిజరిస్‌ సెప్టిక్‌ ట్యాంకులు, పారిశ్రామిక వ్యర్థాల్లో పెరుగుతాయి. రక్తాన్ని పీల్చుకొని ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

డెంగీతో భద్రం
ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగీ గురించే చర్చించుకుంటున్నారు. కొంతమంది వ్యాధి బారిన పడ్డారు. పలు దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈడిస్‌ దోమ కాటుతో వ్యాధి వస్తుంది. వ్యక్తికి కుట్టిన 5-10రోజుల్లో వ్యాధి బయటపడుతుంది. 99శాతం మంది కోలుకునే అవకాశం ఉంది. డెంగీ కారక దోమలు సాధారణంగా పగటిపూట కుడుతాయి. వ్యాధిని పూర్తిగా నివారించే వీలున్నది. కానీ సరైన చికిత్స లభించకపోతే మాత్రం ప్రాణాలకు హాని జరిగే అవకాశం ఉంటుంది.

డెంగీ వ్యాధి లక్షణాలు
ఈడిస్‌ దోమ కుట్టిన 5-10రోజుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కంటి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, చిగుళ్ల నుంచి రక్తస్రావం కలుగుతుంది. వెంటనే వైద్యుడి సూచనల ప్రకారం మందులు వేసుకోవాలి. ఆకస్మిక జ్వరం, రక్తపోటు తగ్గినా, తీవ్రమైన కడుపునొప్పి, నిరంతరంగా వాంతులు, శ్వాస రేటు పెరిగినా, ముక్కు, నోటి, చిగుళ్ల నుంచి రక్తం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగీ నిర్ధారణ అయిన వ్యక్తికి జ్వరం వచ్చిన తర్వాత 10రోజుల వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా తెరలను ఉపయోగించి వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి. నవజాత శిశువులు, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి డెంగీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మురుగు కాల్వలు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దోమల బెడద నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది.

వెంటనే చికిత్స చేయించుకోవాలి
జ్వరం వచ్చిన వెంటనే దవాఖానలో చికిత్స చేయించుకోవాలి. డెంగీ లక్షణాలు లేకపోయినా కొంతమంది పుకార్లు సృష్టిస్తూ డబ్బులు గుంజుతున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు విరేచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు, పంటి చిగుళ్ల నుంచి రక్తం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో చికిత్స చేయించుకోవాలి.ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి.
- రాజ్‌కుమార్‌, మండల వైద్యాధికారి

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles