ప్రతి గింజనూ కొంటాం


Mon,November 11, 2019 10:55 PM

-పొరుగు రాష్ర్టాల ధాన్యం రాకుండా నిఘా పెంచండి
-రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నాం
-దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
-వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్

సంగారెడ్డి చౌరస్తా : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా యంత్రాంగంతో ఖరీఫ్‌లో వరి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరువురు మంత్రులు మాట్లాడుతూ పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా గట్టి నిఘా పెంచాలని సూచించారు. ఇతర రాష్ర్టాల్లో కూడా కేంద్రం నిర్ణయించిన మేరకే కొనుగోలు చేస్తున్నందున పక్క రాష్ర్టాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదన్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండి సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టాలని సూచించారు. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందన్నారు. ఈ 45 రోజులు చాలా కీలకమని ప్రతి కేంద్రం వద్ద కమిటీలు వేసి ధాన్యం అక్రమంగా రాకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదనే విషయాన్ని రైతుల్లో నమ్మకం కలిగించాలని, ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని తెలిపారు. దళారులకు సహకరించే అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

లక్షా 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చు
ఆరుగాలం పండించిన రైతుకు ప్రతి గింజ ముఖ్యమైనదని, వారికి బాసటగా నిలుస్తూ ఏవిధంగా నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మంత్రులకు వివరించారు. ఈ ఖరీఫ్‌లో లక్షా 11వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేశామని తెలిపారు. అందుకు అనుగుణంగా 35 ప్రాథమిక సహకార పరపతి సంఘాలు 37 ఐకేపీ కేంద్రాలను నెలకొల్పి 860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. పొరుగు రాష్ర్టాలు కర్నాటక, మహారాష్ట్ర నుంచి ధాన్యం రాకుండా గట్టి నిఘా పెట్టామని చెప్పారు. జిల్లా నలుమూలల చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వచ్చి పోయే వాహనాల నంబర్లను కూడా నమోదు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం పత్తి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ నిఖిల, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాసులు, మార్కెటింగ్ సహాయ సంచాలకులు నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...