ప్రతి రూట్లో తిరుగుతున్న బస్సులు


Sun,November 10, 2019 11:40 PM

-యథావిధిగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు
-ఉమ్మడి మెదక్ జిల్లాలో సేవలందిస్తున్న బస్సులు 539..
-ఆర్టీసీ బస్సులు 357, అద్దె బస్సులు 160..
సంగారెడ్డి టౌన్ : మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ బస్సులు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లో 626 బస్సులుండగా 517 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఉమ్మడి జిల్లాలో 357 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. శనివారం చలో హైదరాబాద్ నిర్వహించిన కార్మికులు ఆదివారం ఆయా డిపోల ముందు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమ్మె ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా కొనసాగుతున్నది. తాత్కాలిక కార్మికుల ద్వారా బస్సులు యథావిధిగా సేవలందిస్తున్నాయి. ప్రయాణికులు యథేచ్ఛగా వారి గమ్య స్థానాలకు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో పుష్కలంగా బస్సులు తిప్పుతున్నారు.

మెదక్ రీజియన్‌లో తిరిగిన 517 బస్సులు
మెదక్ రీజియన్‌లో 626 బస్సులుండగా అందులో 517 బస్సులు ఆదివారం ప్రయాణికులకు సేవలందించాయి. 357 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలించాయి. మెదక్ జిల్లాలోని మెదక్ డిపోలో 96 బస్సులుండగా అందులో 46 ఆర్టీసీ, 36 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ డిపోలో 55 బస్సులుండగా 27 ఆర్టీసీ, 7 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. సంగారెడ్డి డిపోలో 108 బస్సులుండగా 69 ఆర్టీసీ, 26 ప్రైవేట్ బస్సులు, జహీరాబాద్ డిపోలో 90 బస్సులుండగా 48 ఆర్టీసీ, 23 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపోలో 68 బస్సులుండగా అందులో 46 ఆర్టీసీ, 20 ప్రైవేట్ బస్సులు, సిద్దిపేట డిపోలో 115 బస్సులుండగా 65 ఆర్టీసీ, 32 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. దుబ్బాక డిపోలో 40 బస్సులుండగా 19 ఆర్టీసీ, 4 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. హుస్నాబాద్ డిపోలో 54 బస్సులుండగా అందులో 37 ఆర్టీసీ, 12 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఆదివారం 517 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. అదే విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా వివిధ డిపోల పరిధిలోని కార్మికులు డిపోల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.

రామచంద్రాపురంలో..
రామచంద్రాపురం : ఆర్టీసీ అధికారులు ప్రతి రూట్లో బస్సులను తిప్పుతున్నారు. కార్మికులు సమ్మెను కొనసాగిస్తునప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రైవేట్ డ్రైవర్లను నియమించి ఆర్టీసీ సేవలందిస్తున్నది. ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా ప్రయాణం చేస్తున్నారు. ఆదివారం భెల్ డిపో నుంచి 60 ఆర్టీసీ బస్సులు కోఠి, సికింద్రాబాద్, మెహిదీపట్నం రూట్లలో నడిచాయి. ప్రతి బస్టాప్‌లో బస్సులను నిలిపేలా ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్‌లకు అధికారులు సూచనలు చేశారు. పటాన్‌చెరు నుంచి జంట నగరాలకు ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. ప్రైవేట్ డ్రైవర్లకు, కండక్టర్‌లకు బస్సులు నడిపే విధానం, టికెట్లు తీసుకునే విధానంపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు.

పల్లె పల్లెకు బస్సులు
నారాయణఖేడ్ టౌన్ : నియోజకవర్గంలోని పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం మూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించి బస్సులను నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనూరు, నాగల్‌గిద్ద, సిర్గాపూర్ మండలాలతోపాటు హైదరాబాద్, జహీరాబాద్, మెదక్, పిట్లం రూట్లలో నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రతిరోజు బస్సులను నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామని తెలిపారు. ఆదివారం 40 ఆర్టీసీ బస్సులు, 8 ప్రైవేట్ బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...