ఆద్యంతం కమనీయం


Sun,November 10, 2019 11:38 PM

సంగారెడ్డి చౌరస్తా/రూరల్ : జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన సప్త సరస్వతీ సమార్చన మహోత్సవం ఆదివారం ముగిసింది. రెండోరోజు వేడుకల్లో భాగంగా 1008 నృత్యకారిణులతో ఉమా మహేశ్వరుడికి కూచిపూడి నృత్య సమర్పణ గావించారు. సాయంత్రం నృత్యకారిణులు చేసిన శివతాండవం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి వివిధ పీఠాధిపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముగింపు వేడుకలకు హాజరైన మాజీ హోంమంత్రి జానారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ధార్మిక చింతన అలవర్చుకోవాలని కోరారు. తనకు ఎప్పుడు సమయం దొరికినా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ ప్రాంతానికి ఒక వరమని పేర్కొన్నారు. మాధవానంద స్వామి ఆశీస్సులతో ఉమా మహేశ్వర దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగిందని, ఇది మరో కైలాసంగా విరాజిల్లాలని పేర్కొన్నారు.

దేవాలయ నిర్మాణానికి భక్తులు, ప్రజలు ముందుకు రావాలని కోరారు. రూ.15 నుంచి 20 కోట్ల వరకు విరివిగా విరాళాలు అందించాలన్నారు. కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న నృత్యకారిణులను అభినందించారు. నృత్యం చేసిన విద్యార్థినులందరికీ మంచి భవిష్యత్ ఉండాలని ఆశీర్వదించారు. కాగా, ప్రముఖ నృత్యకారిణి డాక్టర్ ఎస్‌పీ భారతీ, గంగా కాశీనాథ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాధవానంద సరస్వతీ, అనంతపురం అభినవ విద్యాభారతీ, గనుగపురం యోగిరాజ్ మహారాజ్ దండవతే, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నర్సాపురం ఎంపీ కొత్త కృష్ణంరాజు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, వ్యాపారవేత్త కేశవరెడ్డి, గ్రామ సర్పంచ్ నిర్మలాదేవి మాణిక్యం, జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వర శర్మ సిద్ధాంతి, ఆలయ కమిటీ సభ్యులు ప్రశాంత్, ఆయా పీఠాధిపతులు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles