పన్నులు వసూలు చేయండి


Fri,November 8, 2019 11:03 PM

-వసూళ్లు రాబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించండి
-కలెక్టర్ హనుమంతరావు
-అధికారులతో సమీక్ష సమావేశం

సంగారెడ్డి చౌరస్తా : డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేకం ప్రణాళిక ద్వారా ప్రభుత్వ పన్నుల వసూళ్లను రాబట్టాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించిందని అందుకనుగుణంగా అధికారులు బకాయిలు పడ్డ వసూళ్లను రాబట్టే విధంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలకు నిర్దేశించిన డిమాండ్, పన్నుల వసూలు తీరును సమీక్షించారు. విజిలెన్స్‌లో గుర్తించిన విధంగా వాణిజ్య పన్నుల శాఖ 29 కేసులకు సంబంధించి రూ.7.98 కోట్లు బకాయిలు వసూలు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన సంస్థలకు తక్షణమే డిమాండ్ నోటీసులు ఇచ్చి వసూళ్లు రాబట్టాలని వాణిజ్య పన్నుల అధికారికి సూచించారు. అదే విధంగా ఈ సంవత్సరం నిర్దేశించిన రూ. 50 కోట్ల పన్ను వసూలుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి 10 సంస్థల నుంచి రూ. 8.80 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ. 86 లక్షలు మార్క్‌ఫెడ్ ద్వారా వసూలు చేశామని, మిగతావి కోర్టు కేసుల్లో ఉండడం వల్ల వసూలు చేయలేకపోయామని మార్కెటింగ్ సహాయ సంచాలకులు నరేందర్ కలెక్టర్‌కు చెప్పారు.

గనులు, భూగర్భ శాఖకు సంబంధించి 14 కేసుల్లో రూ. 9 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 84లక్షలు వసూలయ్యాయని, మిగతా వాటి వసూలుపై ఆర్‌ఆర్ యాక్ట్ కింద తగు చర్యలు తీసుకోవడంతో పాటు నోటీసులు ఇవ్వాలని ఆ శాఖ సహాయ సంచాలకులకు కలెక్టర్ ఆదేశించారు. కామన్ గుడ్ ఫండ్ కింద దేవాదాయ శాఖలో రూ.52లక్షలు వసూలు చేయాల్సి ఉండగా వివిధ దేవాలయాల నుంచి రూ. 24లక్షలు వసూలు చేశారని, మిగతావి వసూలు అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి 9 సంస్థల నుంచి రావాల్సిన రూ. 7కోట్ల 49లక్షల వసూలుకు తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారికి సూచించారు. లే అవుట్ అభివృద్ధి చార్జీల కింద కొల్లూర్‌లో రూ. 10కోట్ల 76లక్షల వసూలు రావాల్సి ఉన్నదని, అలాగే రెవెన్యూ శాఖల ద్వారా కోట్ల రూపాయలు చేయాల్సి ఉన్నదని కలెక్టర్ తెలిపారు. ఏఏ సంస్థల నుంచి ఎంతెంత రావాల్సి ఉన్నదో యాక్షన్ ప్లాన్ టోకెన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...