ట్రాక్ట్టరొచ్చింది..


Fri,November 8, 2019 12:05 AM

-రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి
-ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
-వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభం

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని, కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొడుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ మండలం నిజాంపేటలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ర్యాలమడుగు, నర్సాపూర్, సంజీవన్‌రావుపేట, లింగాపూర్, తుర్కపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు రైతులకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. గతంలో వరి కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయగా, సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రతి పంటను మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

తాను స్వయంగా రైతును కావడం వల్ల రైతుల కష్టాలు తనకు తెలుసునని, తప్పనిసరిగా రైతులను ఆదుకునే విషయంలో అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నిజాంపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసే విషయంలో అవసరమైన చర్యలు ప్రారంభించామని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావుల సహాకారంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. రూ.1,835ల డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్నపటేల్ మాట్లాడుతూ నిజాంపేటలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే విషయంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారన్నారు. గ్రామంలో గతంలోనే డీసీఎంఎస్ సౌజన్యంతో ఎరువుల దుకాణాన్ని సైతం ఏర్పాటు చేశామని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో రైతులకు డబ్బులు అందజేస్తామన్నారు. నాణ్యమైన ధాన్యం తెచ్చి రైతులు, తమ సిబ్బందికి సహకరించాలని సూచించారు.

నూతన ట్రాక్టర్‌ను ప్రారంభం..
నారాయణఖేడ్ మండలం నిజాంపేట పంచాయతీకి మంజూరైన నూతన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో డంప్‌యార్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను మంజూరు చేసి విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇదిలా ఉంటే నిజాంపేట సర్పంచ్ జగదీశ్వర్‌చారి దాతల సహాకారంతో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద మొత్తం 30 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే, సర్పంచ్‌ను అభినందించారు. ఏదైనా చేయాలనే తపన ఉంటే సాధ్యం కానిది లేదని ప్రశంసించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీరవీందర్‌నాయక్, వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం.ఏ.బాసిత్, ఆత్మ చైర్మన్ రాంసింగ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు రమేశ్ చౌహాన్, లింగారెడ్డి, నవాబ్‌పటేల్, వెంకటేశం, కిష్టారెడ్డి, రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...