పనులు మొదలు పెట్టండి..


Wed,November 6, 2019 11:30 PM

-ప్రారంభించకుంటే రద్దే..
-అభివృద్ధి పనులు
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
-సమస్యలు ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
-కలెక్టర్ హనుమంతరావుఅంకితభావంతో

సంగారెడ్డి చౌరస్తా: జిల్లాలో ఆయా పనులను మొదలు పెట్టని యెడల వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ఆ పనులను రద్దు చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పద్దుల కింద మంజూరైన పనులు ఇప్పటి వరకు మొదలు పెట్టని యెడల ఈ నెల 10లోగా మొదలు పెట్టాలని, లేని పక్షంలో ఆయా పనులను రద్దు చేస్తామని ఇంజినీరింగ్ అధికారులతో స్పష్టం చేశారు. 2018 సంవత్సరంలో పనులు మంజూరైనా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.5లక్షలలోపు చిన్న చిన్న పనులు కూడా చేపట్టక పోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇంజినీరింగ్ అధికారులు అలసత్వం విడి క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రగతిలో ఉన్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు వాటి నాణ్యతను పరిశీలించి ఎంబీ రికార్డు చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు త్వరగా చెల్లించేలా చూడాలని పేర్కొన్నారు.

ఇంకా నిర్మాణం చేపట్టని గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, కమ్యూనిటీ భవనాలు, ప్రహారీ గోడలు, బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. పని చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, నామినేషన్ పద్ధతిలో చేపట్టిన పనులకు ముందుకురాని వాటిని రద్దు పర్చాలని కలెక్టర్ సూచించారు. కుంటి సాకులు చెప్పకుండా వెంటనే టెండర్లు పిలిచి ఎల్-1 అయిన వెంటనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి వాటిని మొదలు పెట్టాలని చెప్పారు. స్థల సమస్య ఉన్నా, అవసరం లేని ప్రాంతాల్లో పనులు మంజూరైన వాటిని రద్దు పరుస్తూ అవ్సరమైన ప్రాంతాల్లో పనులు చేపట్టాలని, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కొనుగోలు చేయాలని, దానికి టెండర్ అవసరం లేదని, ఆడిట్ కూడా ఉండదని, ఇండెంట్ ఇస్తే సరిపోతుందని వివరించారు.

అదేవిధంగా కొన్ని గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాలను కూల్చివేసి నూతన భవనాల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మాచింగ్ గ్రాంట్ కోసం చూడకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ జితేశ్ వి పాటిల్, కార్యనిర్వాహక ఇంజినీరు సామోదర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అంజయ్య, తులసీరాం, శ్రీనివాస్, సహాయ ఇంజినీర్లు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...