ముగిసిన గడువు


Wed,November 6, 2019 01:21 AM

సంగారెడ్డి టౌన్‌ : సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులందరూ మంగళవారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరాలని గడువు విధించిన విషయం తెలిసిందే. మంగళవారంతో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసింది. చివరి రోజు 8 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత ఉమ్మడి జిల్లాలో 3వ తేదీన ఒకరు, 4వ తేదీన ఆరుగురు, 5వ తేదీన 8 గురు విధుల్లో చేరుతున్నట్లు అంగీకార పత్రాలను అందజేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 15 మంది గడువు ముగిసిన నాటికి విధుల్లో చేరారు. సిద్దిపేట డిపోలో 8 మంది, మెదక్‌ డిపోలో ముగ్గురు, నారాయణఖేడ్‌ డిపోలో ఇద్దరు, జహీరాబాద్‌ డిపోలో ఒకరు, భెల్‌ డిపోలో ఒకరు విధుల్లో చేరుతున్నట్లు అంగీకార పత్రాలను ఆయా డిపోల మేనేజర్లకు అందజేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి తీసుకోబోమని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో గడువు ముగియడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొన్నది. బుధవారం ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం ప్రకటన కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు. కాగా, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంగళవారం వరకు 15మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్‌ మంగళవారం రాత్రి 12గంటల వరకు గడువు విధించడంతో ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 15 మంది కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు ఆయా డిపోల మేనేజర్లకు అంగీకార పత్రాలను అందజేశారు. సిద్దిపేట డిపో లో ఒక డ్రైవర్‌, కండక్టర్‌ అంగీకారపత్రాన్ని అందజేశారు. ఈ నెల 3న సిద్దిపేట డిపోలో కండక్టర్‌ పి.బాలవిశ్వేశ్వర్‌రావు విధుల్లో చేరగా, 4వ తేదీన సిద్దిపేట డిపోలో కండక్టర్లు కె.న ర్సింహులు, సంతోశ్‌గౌడ్‌, డ్రైవర్‌ పి.మల్లేశం, మెదక్‌ డిపోలో కండక్టర్‌ కృష్ణమూర్తి, నారాయణఖేడ్‌ డిపోలో డ్రైవర్‌ రమేశ్‌, జహీరాబాద్‌ డిపోలో సురేందర్‌లు చేరిన విషయం విదితమే. కాగా, 5వ తేదీ మంగళవారం రోజు మెదక్‌ డిపోలో ఎండీ చాంద్‌మియా, సిద్దిపేట డిపోలో సీహెచ్‌ ఆర్‌బీ రెడ్డి, డ్రైవర్‌ వి.బాల్‌రెడ్డి, కండక్టర్లు కేఎస్‌ రెడ్డి, సుజాత, మెదక్‌ డిపోలో కండక్టర్‌ బి.ప్రభాకర్‌, నారాయణఖేడ్‌ డిపోలో డ్రైవర్‌ ఖలీమ్‌బేగ్‌లు విధుల్లో చేరుతామని అంగీకారపత్రాలు అందజేశారు.

ఉమ్మడి జిల్లాలో తిరిగిన 550 బస్సులు
మెదక్‌ రీజియన్‌ పరిధిలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని 8 డిపోల పరిధిలో మంగళవారం 550 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. ఉమ్మడి జిల్లాలో 638 బస్సులు ఉండగా, 386 ఆర్టీసీ, 164 ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. మెదక్‌ డిపోలో మొత్తం 98 బస్సులు ఉండగా, అందులో 52 ఆర్టీసీ, 36 ప్రైవేట్‌ బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశాయి. నారాయణఖేడ్‌ డిపో పరిధిలో 57 బస్సులు ఉండగా, 43 ఆర్టీసీ, 8 ప్రైవేట్‌ బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సంగారెడ్డి డిపో పరిధిలో 108 బస్సులు ఉండగా, అందులో 73 ఆర్టీసీ, 24 ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను సురక్షితంగా చేరవేశాయి. జహీరాబాద్‌ డిపో పరిధిలో 93 బస్సులు ఉండగా, 50 ఆర్టీసీ, 22 ప్రైవేట్‌, సిద్దిపేట డిపో పరిధిలో 118 బస్సులు ఉండగా, అందులో 63 ఆర్టీసీ, 38 ప్రైవేట్‌, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపో పరిధిలో 69 బస్సులు ఉండగా, 43 ఆర్టీసీ, 20 ప్రైవేట్‌ బస్సులు ప్రజలకు సేవలందించాయి. దుబ్బాక డిపో పరిధిలో 40 బస్సులు ఉండగా, 22 ఆర్టీసీ, 4 ప్రైవేట్‌ బస్సుల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించారు. హుస్నాబాద్‌ డిపోలో 55 బస్సులు ఉండగా, 40 ఆర్టీసీ, 12 ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తరలించాయి.

కొనసాగుతున్న ఆందోళనలు
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా డిపోల పరిధిలో ధర్నా నిర్వహించి వంటావార్పు కార్యక్రమాలు చేశారు. సంగారెడ్డి డిపోకు చెందిన కండక్టర్‌ సాయిబాబా శాంతియుతంగా సమ్మె చేస్తున్న మమ్మల్ని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు ఆహ్వానించాలని కోరుతూ గాంధీ వేషధారణలో నిరసన తెలిపారు. కార్మికులు నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు.

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు
నారాయణఖేడ్‌ టౌన్‌ : ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తుండడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా డీఎం మూర్తి రాజీవ్‌ చౌరస్తా వద్ద బస్సులను నిలుపుతూ ప్రయాణికులకు బస్సు సర్వీసులను కల్పిస్తున్నారు. నారాయణఖేడ్‌ డిపో నుంచి సుమారు 41 బస్సులు, 10 ప్రైవేట్‌ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.

భెల్‌ డిపోలో 66 బస్సులు
రామచంద్రాపురం : ఆర్టీసీ కార్మికలు 33 రోజులుగా సమ్మె చేస్తునప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. భెల్‌ డిపో నుంచి ప్రతి రోజు సుమారుగా 66 బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు కృషిచేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారని డిపో మేనేజర్‌ సత్యనారాయణ తెలిపారు.

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసు శాఖ రక్షణ
జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని జహీరాబాద్‌ డీఎస్పీ గణపత్‌ జాదవ్‌ తెలిపారు. మంగళవారం జహీరాబాద్‌ ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లను పరిశీలించి ఎస్‌ఐలకు పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులు ఆస్తులకు నష్టం చేసిన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపించేందుకు పోలీసు శాఖ రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. సమ్మె నుంచి వచ్చి విధుల్లో చేరే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. విధుల్లో చేరిన కార్మికులపై దాడి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జహీరాబాద్‌ ఆర్టీసీ డిపో ఆవరణలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ నోడల్‌ సీఐ. పాలవెల్లి, ఎస్‌ఐలు వెంకటేశ్‌, వినాయ్‌కుమార్‌, గణేశ్‌, విఠల్‌తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...