పొలం బాట


Mon,November 4, 2019 10:58 PM

-అన్నదాతకు అండగా రైతు నేస్తం ప్రారంభం
-నేరుగా రైతుల వద్దకు వెళ్తున్న ఏఈవోలు
-పంటల సాగు, ఎరువుల వాడకంపై అవగాహన
-ఈ నెల 1 నుంచి కార్యక్రమం షురూ..
-జిల్లాలో 2,92 లక్షల మంది రైతులు
-విధులు నిర్వహిస్తున్న 115 మంది ఏఈవోలు
-ఇప్పటి వరకు 2,300 రైతులను కలిసిన ఏఈవోలు
-రోజువారీగా ఒక్కో ఏఈవో 25 మంది రైతులను ప్రత్యక్షంగా కలువాలి
-ఎప్పటికప్పుడు సమాచారాన్ని కోబో యాప్‌లో అప్‌లోడ్...
-కలెక్టర్ ఆలోచనతో కర్షకులకు ప్రయోజనం 2.92 లక్షల మంది రైతులకు అవగాహన..
రైతుబంధు పెట్టుబడి పంపిణీ లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 2.92 లక్షల మంది వరకు రైతులున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్నలతో పాటు పప్పుదినుసు పంటలు సాగవుతున్నాయి. అలాగే కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఆయా పంటల సాగు విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా ఎరువులు, పురుగు మందులు వాడి రైతులు నష్టపోతున్న సందర్బాలుంటున్నాయి. అప్పులు చేసి పంటలు సాగుచేస్తున్న రైతులు నష్టాలతో దివాళా దీస్తున్నారు. బలవర్మరణాలకు పాల్పడడానికి వెనుకాడడం లేదు. ఈ పరిస్థితుల్లో ముందు పంటల సాగులో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు సంకల్పించారు. ఒక పంటల సాగే కాకుండా రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి తెలియాల్సిన అవసరం ఉందని గుర్తించారు. భూసార పరీక్షలు చేయించుకుని, ఉన్న భూమిలో ఎలాంటి పంటలు సాగుచేసుకోవాలో రైతులకు సమాచారాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఒక్కో ఏఈవో 25 మంది రైతులను కలువాల్సిందే...
రైతు నేస్తంలో భాగంగా ఒక్కో ఏఈవో 25 మంది రైతులను కలువాల్సి ఉంటుంది. రైతులతో కలిసిన ఫొటో, పంటల సాగులో రైతులకు సూచించిన సమాచారాన్ని కూడా పొందుపరుస్తూ వివరాలను కోబో యాప్‌లో పెట్టాలి. ప్రస్తుతం జిల్లాలో 115 మంది వరకు ఏఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, సోమవారం సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా 115 మంది ఏఈవోలు మొత్తం 2300 మంది రైతులను కలిసి వచ్చారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని యాప్‌లో పొందుపరిచారు కూడా.

ఏఈవోలు అందిస్తున్న సమాచారం ఆధారంగా జిల్లా అధికారి నర్సింహారావు కూడా గ్రామాలకు వెళ్తున్నారు. వివిధ గ్రామాలకు వెళ్లి పంటల సాగులో రైతులకు ఏఈవోలు ఇచ్చిన సలహాలు, సూచలను అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం జేడీ సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర, ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు వివరించారు. కష్టపడి పంటలు సాగుచేస్తున్న రైతులు పంటలను అమ్ముకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని సూచించారు.

ఇతర ప్రభుత్వ పథకాలపై కూడా...
పంటల సాగుతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై రైతు కుటుంబాలకు ఏఈవో అవగాహన, ప్రచారం కల్పిస్తున్నారు. పంటల సాగుతో పాటు కూరగాయల సాగు, పశువులు, కోళ్ల పెంపకం గురించి వివరిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా వర్తించిందా..? లేదా తెలుసుకుంటున్నారు. ఒకవేళ పెట్టుబడి అందకపోతే కారణం తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్ల గురించి కూడా రైతులకు వివరిస్తున్నారు. కేవలం రైతు కుటుంబాల వద్దకు మాత్రమే వెళ్లి ఏఈవోలు అన్ని విధాలుగా వారికి అవగాహన కల్పిస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బ్లాకు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోర్డులపై జిల్లా, మండల వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లతో పాటు ఏఈవో పేరు నెంబర్లు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పంటలకు అందిస్తున్న మద్దతు ధరలు కూడా సూచించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే విత్తన, పురుగు మందుల దుకాణాల వద్ద కూడా ప్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారుల ఫోన్ నెంబర్లు పెడుతున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...