260 ఎకరాలు..1200 ఇండ్ల నిర్మాణాలు


Sun,November 3, 2019 11:14 PM


-250 గజాల్లో చక్కటి వసతుతో ఇండ్ల నిర్మాణాలు
-విశాలమైన రోడ్లు.. ఇంటింటికీ భగీరథ నీళ్లు
-260 ఎకరాల్లో 1200 ఇండ్ల నిర్మాణాలు
-ఇప్పటికే 600 ఇండ్లు పూర్తి.. వివిధ దశల్లో మరో 600
-తొలిదశలో 212 ఇండ్లు అప్పగించేందుకు సన్నద్ధం
-రేపోమాపో గృహప్రవేశాలు..40 ఇండ్లకోధికారి పర్యవేక్షణ
-ఇండ్లను చూసి భూనిర్వాసితుల సంబురం

ములుగు : ప్రాజెక్టుల కోసం భూములిచ్చి.. తరతరాలుగా ఉంటున్న ఇండ్లను వదిలి.. భూ నిర్వాసితులుగా మారిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ద్వారా పునరావాసం.. పునరోపాధి కల్పిస్తూ నిర్వాసితుల జీవితాలకు భరోసాను కల్పిస్తున్నది. కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన మామిడ్యాల, భైలంపూర్, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండానిర్వాసితుల త్యాగాలను గుర్తించిన ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలను అందించి అందమైన డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్వాసితుల కోసం సిద్ధం చేసింది. న్యాయమైన నష్టపరిహారాన్ని అందించడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండల పరిధిలోని తునికిబొల్లారం సమీపంలో విశాలమైన రోడ్లు, పూర్తి స్థాయి మౌలిక వసతులతో కూడిన చక్కని గృహసముదాయాలను నిర్మించి అందిస్తోంది. ఈ నెలలో సామూహిక గృహ ప్రవేశాలు జరిపేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తూ అధికారుల నిరంతర పర్యవేక్షణలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

అందమైన గృహ సముదాయాలు
కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ములుగు మండలం మామిడ్యాల, భైలంపూర్, తానేదార్‌పల్లి, తానేదర్‌పల్లి తండా గ్రామాలకు చెందిన సుమారుగా 877 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అం దించనున్న ఆర్‌అండ్‌ఆర్ గృహాలు అందిస్తున్నది. ప్రతి నిర్వాసిత కుటంబానికి ఒక ఇంటితో పాటు ఆ కుటుంబంలో పెళ్లయిన దంపతులుంటే వారికి అదనంగా మరో ఇంటిని నిర్మిం చి అందిస్తోంది. దీంతో ఒకే కుటంబానికి రెండేసి, మూడేసి ఇండ్లు అందనున్నాయి. నిర్వాసితుల కోసం ప్రభుత్వం ము లుగు మండలం తునికిబొల్లారంలో 260 ఎకరాల స్థలాన్ని కేటాయించి, 1200ఇండ్లతో ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ చేపట్టింది. ఇందులో ఇప్పటికే 600 ఇండ్ల నిర్మాణాలు పూర్తవగా, మరో 200 ఇండ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మిగతా 400 వివిధ దశల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 250 గజాల విస్తీర్ణంలో ఒక్కో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు.

కాలనీలో సకల వసతుల కల్పన
గృహ సముదాయాల ఆవరణలో విశాలమైన రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం తదితర మౌలిక వసతులతో ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ జిగేల్‌మంటోంది. అన్ని వసతులతో గృహాలు నిర్మించి నిర్వాసితులకు అందజేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులను సమకూర్చింది. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్మాణమవుతున్న ఇండ్లలో రెండు పడక గదులతో పాటు హాల్, కిచెన్, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మంచి నీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటి వసతిని కల్పించారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇతర అవసరాల కోసం 100 గజాల ఖాళీ స్థలాన్ని కేటాయించారు. కాలనీవాసుల సౌకర్యార్థం పాఠశాల భవనం, కమ్యూనిటీ భవనాలను కూడా ప్రభుత్వం నిర్మించనున్నది.

నిర్వాసితులను అక్కున చేర్చుకున్న ప్రభుత్వం
గతంలో భూనిర్వాసితులంటే చాలీ చాలని.. అందీ అందని.. నష్టపరిహారం..! చెట్టుకొకరు.. పుట్టకొకరుగా.. విడిపోయిన బతుకులు..! ఇప్పటికి నష్టపరిహారం అందక కోర్టుల చుట్టు తిరుగుతున్న వందలాది కుటుంబాలు. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో స్వరాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అలాంటి పరస్థితి లేదు వారి జీవితాలకు నిండు భరోసాను ఇస్తూ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ న్యాయమైన నష్టపరిహారాన్ని అందించి భూనిర్వాసితుల జీవితాల్లో ఎలాంటి అలజడి లేకుండా ఆనందంగా ముందుకు నడిపిస్తూ వారిలో కొత్త వెలుగులు నింపుతోంది. తమ గ్రామాలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కనుమరుగవనున్నాయని, తమ బతుకులు ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయేమోనని నిర్వాసిత గ్రామస్తులు మొదట్లో కొంత ఆందోళన చెందినప్పటికీ, పూర్తిస్థాయి మౌలిక వసతులతో నిర్మించి అందించనున్న ఆర్‌అండ్‌ఆర్ గృహ సమదాయాలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనుల పర్యవేక్షణలో అధికార బృందాలు
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యంవహిస్తున్న గజ్వేల్ నియోజవకర్గానికి చెందిన ములుగు, మర్కూక్ మండలాల్లో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన భూనిర్వాసితుల కోసం ములుగు మండల పరిధిలోని తునికిబొల్లారం సమీపంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గృహ సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 1200 ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే 600 ఇండ్లను పూర్తి చేయగా మరో 600 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణమవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు 5 మంది తహీసీల్దార్లు ఒక్కొక్కరు 40 ఇండ్ల చొప్పున బాధ్యతలు తీసుకొని, మొదటి విడుతలో తానేదార్‌పల్లి తండా నిర్వాసితులకు 212 ఇండ్లను అందజేసేందుకు కసరత్తులు ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులనుపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

అతిత్వరలో గృహ ప్రవేశాలు
సమైక్య పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తెలంగాణ, నేడు అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో అనేక రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ముంపునకు గురై ఇండ్లు, వ్యవసాయ భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పినట్లుగానే భూనిర్వాసితులకు అండగా నిలిచింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలను అందించి అందమైన డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్వాసితుల కోసం సిద్ధం చేసింది. అందంగా తీర్చిదిద్దిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను నవంబర్ మొదటి వారంలో నిర్వాసితులకు అందజేసి సామూహిక గృహ ప్రవేశాలు జరిపేందుకు అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...