నేడు అమీన్‌పూర్‌లో మంత్రుల పర్యటన


Sat,November 2, 2019 11:15 PM

-అమీన్‌పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు
-నేడు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల రాక
-రూ.49 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
-రూ.61 కోట్లతో నిర్మించిన భారీ రిజర్వాయర్ ప్రారంభోత్సవం
-ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ/ అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపల్‌వాసుల తాగునీటి సమస్య తీరనున్నది. ట్రాఫిక్‌జాంలకు కారణమవుతున్న రోడ్డు నాలుగులైన్లుగా నిర్మాణం కాబోతున్నది. మున్సిపాలిటీ పరిధిలో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేసేందుకు ఆదివారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లక్ష మంది దాహం తీరనున్నది..
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని ప్రజలందరి దాహం తీరనున్నది. 105 కాలనీలతో అమీన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది. దాదాపు లక్ష జనాభా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు. అన్ని కాలనీలకు తాగునీరు అందజేసేందుకు దాదాపు రూ.61 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, సుమారు 30 లక్షల లీటర్ల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్‌ను బీరంగూడ గుట్టపై నిర్మించారు. ఇప్పటికే 80 శాతం పైప్‌లైన్ పనులు పూర్తి చేశారు. మరికొన్ని కాలనీల్లోను పనులు చకచకా జరుగుతున్నాయి. మంత్రులు ఆదివారం ఈ రిజర్వాయర్‌ను ప్రారంభిస్తుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలకుల పాలనలో అమీన్‌ఫూర్‌లో తాగునీటికి తిప్పలు తప్పలేదు. దీంతో వర్షాకాలంలోనూ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని కొనుగోలు చేసేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక కృషితో ఈ రిజర్వాయర్‌ను గుట్టపై కట్టించారు. ఇంజినీర్ల డిజైనింగ్‌తో అద్భుంతగా గ్రావీటీపై ఆధారపడి తాగునీరు ప్రతి గడపకూ వెళ్లబోతున్నది.

తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు..
బీరంగూడ కమాన్ నుంచి కిష్టారెడ్డిపేట ఓఆర్‌ఆర్ వరకు నాలుగులైన్లుగా రోడ్డును వెడల్పు చేసేందుకు ఆదివారం మంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు రూ.49 కోట్ల ఖర్చుతో నాలుగులైన్లుగా ఈ రోడ్డును విస్తరణ జరుగనున్నది. ఈ ప్రాంతం విస్తరిస్తుండడంతో ఇక్కడ ఏండ్లుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా శంభునికుంటకు వెళ్లే కాలువలు మూసుకుపోవడంతో వర్షం నీరు రోడ్లపైనే నిలుస్తున్నది. దీంతో రోడ్లన్నీ అధ్వాహ్నంగా మారాయి. టీఆర్‌ఎస్ సర్కార్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు, వివైడర్లు, వీధిలైట్లు, రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్య ప్రజలకు దూరం కానున్నది.

దేవాలయాల నిర్మాణం
బీరంగూడ మల్లికార్జునస్వామి దేవస్థానం ఆవరణలో దాతల సాయంతో శ్రీకృష్ణ దేవాలయం, అయ్యప్పస్వామి, మార్కండేయ ఆలయం, పోతులూరి వీరభ్రహ్మంద్రస్వామి, కన్యక పరమేశ్వరీ దేవాలయాలు, సత్రాల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఎన్.నర్సింహాగౌడ్ దాత ద్వారా ఏర్పాటు చేస్తున్న శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.10 కోట్ల 60లక్షల ఖర్చుతో దాతలు ఈ దేవాలయాల నిర్మాణాలకు ముందుకొచ్చారు.

ఏర్పాట్ల తనిఖీలు
అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హాజరు కానుండడంతో శనివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పటాన్‌చెరు డీఎస్పీ రాజేశ్వర్‌రావు, అమీన్‌పూర్ తహసీల్దార్ స్వామి, ఇంజినీర్లతో ఎమ్మెల్యే మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తుమ్మల పాండురంగారెడ్డి, యాదగిరియాదవ్, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్, నర్సింహాగౌడ్, తులసిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజ్, యూనుస్, రాజు, హెచ్‌ఎండీఏ డిప్యూటీ ఈఈ దీపక్, వాటర్ గ్రీడ్ అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్‌శాఖ కమిషనర్ వేమనరెడ్డి, ట్రాఫిక్ సీఐ వేణు తదితలు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...