ఆర్టీసీ పరుగులు


Fri,November 1, 2019 10:52 PM

-ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగిన 548 సర్వీసులు
-ప్రయాణికులకు సేవలందించిన 388 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు
-ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న అధికారులు

సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీ బస్సులు పల్లెల్లో కూడా పరుగులు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో యథేచ్ఛగా బస్సులు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో 548 బస్సులు ప్రజలకు సేవలందించాయి. 388 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సుల ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారి వారి స్వస్థలాలకు చేరుస్తున్నాయి. సరిపడా బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతుండడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమ్మె ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. యథేచ్ఛగా పుష్కలంగా బస్సులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగిన బస్సులు
మెదక్ రీజియన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఆర్టీసీ అధికారులు 548 బస్సుల ద్వారా ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. 388 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 8 డిపోల పరిధిలో పుష్కలంగా బస్సులు తిరుగుతున్నాయి. మెదక్ డిపోలో 52 ఆర్టీసీ, 35 ప్రైవేట్ బస్సులు, సంగారెడ్డి డిపోలో 74 ఆర్టీసీ, 24 ప్రైవేట్ బస్సులు,నారాయణఖేడ్ డిపోలో 44 ఆర్టీసీ, 7 ప్రైవేట్ బస్సులు, జహీరాబాద్ డిపోలో 47 ఆర్టీసీ, 23 ప్రైవేట్ బస్సులు, సిద్దిపేట డిపోలో 66 ఆర్టీసీ, 35 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 46 ఆర్టీసీ, 20 ప్రైవేట్ బస్సులు, దుబ్బాక డిపోలో 20 ఆర్టీసీ, 4 ప్రైవేట్ బస్సులు, హుస్నాబాద్ డిపోలో 38 ఆర్టీసీ, 12 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను తరలించాయి.

కొనసాగుతున్న కార్మికుల నిరసనలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జేఏసీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు ఎదుట అమరులైన కార్మికులకు నివాళులు అర్పించి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు..
నారాయణఖేడ్ టౌన్ : ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ బస్సు సర్వీసులను కొనసాగిస్తున్నామని నారాయణఖేడ్ ఆర్టీసీ డీఎం మూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో 63 బస్సులు ఉండగా 44 బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించి నడిపినట్టు తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్, బీదర్, జహీరాబాద్, కంగ్టి, మెదక్, తదితర రూట్లలో బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ డిపోలో ఉన్న అన్ని బస్సులను నడిపి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా చూస్తామన్నారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని పేర్కొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...