పల్లె పల్లెకూ ఆర్టీసీ బస్సులు


Mon,October 21, 2019 11:19 PM

-ఉమ్మడి మెదక్ జిల్లాలో సేవలందించిన 517 బస్సులు
-అన్ని రూట్లలో తిరిగిన బస్సులు
-విద్యార్థులకు అందుబాటులో బస్సులు
-తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లకు దరఖాస్తులు
-ఉమ్మడి జిల్లాలో కుటుంబ సభ్యులతో నిరసన తెలిపిన కార్మికులు

సంగారెడ్డిటౌన్/జహీరాబాద్/నారాయణఖేడ్ టౌన్ : ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ బస్సులు సేవలందించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 626 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఉండగా, 517 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రీజియన్ పరిధిలో సోమవారం 364 ఆర్టీసీ, 153 ప్రైవేట్ బస్సులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లలో సేవలందించాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 17 రోజులైంది. ఉమ్మడి జిల్లాలో ప్రజలకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నామ మార్గాల ద్వారా బస్సులను తిప్పుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్లను నియమించి ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లలో బస్సులను తిప్పారు. ఉమ్మడి జిల్లాలోని 8డిపోల వద్ద కార్మికులు కుటుంబ సభ్యులతో దీక్షలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అన్ని రూట్లలో విరివిగా బస్సులు..
ఉమ్మడి జిల్లా ప్రజలకు వారి గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రూట్లో బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బస్సుల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వీరి ద్వారా ప్రతి రోజు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అవసరం ఉన్న రూట్లలో ప్రయాణికుల కోరిక మేరకు అదనంగా బస్సులను తిప్పుతున్నారు. ఉదయం 5.00 గంటల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో 517 బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. 364 ఆర్టీసీ బస్సులు, 153 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలోని అన్ని మారుమూల ప్రాంతాలకు సైతం అధికారులు బస్సులను నడిపారు.

రీజియన్‌లోని 8డిపోల పరిధిలో మెదక్ డిపోలో 96 బస్సులు ఉండగా, ఆర్టీసీ 50, ప్రైవేట్ 34 బస్సులు తిరిగాయి. నారాయణఖేడ్ డిపోలో 55 బస్సులు ఉండగా, ఆర్టీసీ 32, ప్రైవేట్ 06 బస్సులను తిప్పారు. సంగారెడ్డి డిపోలో 108 బస్సులు ఉండగా, ఆర్టీసీ 72, ప్రైవేట్ 24 బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపోలో 115 బస్సులు ఉండగా, ఆర్టీసీ 54, ప్రైవేట్ 35 బస్సులు తిరిగాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 68 బస్సులు ఉండగా, ఆర్టీసీ 44, ప్రైవేట్ 19 బస్సులు ప్రజలకు సేవలందించాయి. జహీరాబాద్ డిపోలో 90 బస్సులు ఉండగా, ఆర్టీసీ 48, ప్రైవేట్ 20 బస్సుల ద్వారా ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చారు. దుబ్బాక డిపోలో 40 బస్సులు ఉండగా, ఆర్టీసీ 28, ప్రైవేట్ 3 బస్సులు తిరిగాయి. హుస్నాబాద్ డిపోలో 54 బస్సులు ఉండగా, ఆర్టీసీ 36, ప్రైవేట్ 12 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి.

కుటుంబ సభ్యులతో కార్మికుల నిరసనలు..
సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల ఎదుట కార్మికులు వారి కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు వారికి పూర్తి మద్దతు ప్రకటించారు.

జహీరాబాద్ డిపో ఎదుట కార్మికుల ధర్నా..
జహీరాబాద్, నమస్తే తెలంగాణ: జహీరాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేయడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని కార్మికులు ధర్నాకు దిగడంతో పోలీసులు కలుగజేసుకుని కార్మికులను అక్కడి నుంచి పంపించారు.

విద్యార్థుల కోసం బస్సు కేంద్రం ప్రారంభం
జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో విద్యార్థుల కోసం బస్సు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా పాసులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయుల మద్దతు
జిన్నారం:/గుమ్మడిదల/వట్‌పల్లి:ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. సోమవారం చెట్లపోతారం, మాదారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభు త్వం వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్‌పటేల్ కోరారు. సోమవారం వట్‌పల్లి మండలం మర్వెల్లిలో భోజన విరామ సమయంలో కార్మికులకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జైపాల్, శివకుమార్, శ్రీలత, నాగిరెడ్డి, సాయిలీల, విజయరావు, చంద్రశేఖర్, స్వప్న, లవకుశ, లక్ష్మణ్ పాల్గొన్నారు. గుమ్మడిదల మండల కేంద్రంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజారెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయులు నాజియాతబుస్సుం, టీచర్లు రాజేశ్వరరావు, బుచ్చిరెడ్డి, అనంతరెడ్డి, సరోజ నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...