వైకుంఠధామాలు త్వరగా పూర్తిచేయాలి


Mon,October 21, 2019 11:14 PM

-అధికారులతో కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలో వైకుంఠధామాలు, డంప్‌యార్డుల నిర్మాణాలు నవంబర్ 15లోగా పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, ఎంఈవోలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామాల్లో విధిగా వైకుంఠధామాలు, డంప్‌యార్డులు, నర్సరీలు, ఇంకుడుగుంతలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. వైకుంఠధామాలు, డంప్‌యార్డుల నిర్మాణాలకు వందశాతం స్థలాలు కేటాయించామని, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో తిరిగి పనులు వేగంగా పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీల్లో పది గుంటల స్థలంలో నర్సరీలు ఏర్పాటు చేసి చుట్టూ పెన్సింగ్ చేయాలన్నారు. నర్సరీల ఏర్పాటు కోసం కావాల్సిన విత్తనాలు, పెన్సింగ్‌కు కావాల్సిన అంచనాలను రూపొందించి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి ఇంటి ఎదుట పది కృష్ణతులసి మొక్కలు పెంచే విధంగా చూడాలని అన్నారు. జిల్లాలో 3లక్షల గృహాలు ఉన్నాయని, ప్రతి ఇంటి ఎదుట ఇంకుడుగుంత నిర్మించాలని స్పష్టం చేశారు. వారం వారం మండలాల వారీగా పనుల పురోగతిని సమీక్షిస్తానని వెల్లడించారు. అధికారులు నిరంతరం పనులు జరిగే విధంగా చూడాలన్నారు. ఇంకా స్థల సేకరణ చేయని ప్రాంతాలు ఉంటే వెంటనే గుర్తించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులను సమకూరుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే దాతలు, ఎన్‌ఆర్‌ఐల సహాయం తీసుకోవాలన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో పనులు మందగమనంలో ఉన్నాయని, వెంటనే వేగం పెంచాలన్నారు. ఈ నాలుగు అంశాలపై దృష్టి సారించనున్నందున క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు వందశాతం సాధించే విధంగా మండల విద్యాధికారులు కృషి చేయాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...