సాఫీగా ప్రయాణం


Sun,October 13, 2019 12:00 AM

- యథావిధిగా సేవలందించిన ఆర్టీసీ బస్సులు
- ఎనిమిదో రోజు తిరిగిన 496బస్సులు
- 339ఆర్టీసీ, 157 ప్రైవేట్‌ బస్సులు
- కనిపించని సమ్మె ప్రభావం
- నేటి నుంచి బస్సుల్లో టికెట్ల జారీ
- నేడు మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఉద్యోగాలకు ఇంటర్యూలు
- ఆర్టీసీ సమ్మెతో ఈ నెల 19 వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు బస్సులను ఉమ్మడి జిల్లా పరిధిలో యధేచ్ఛగా నడుపుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులైన బస్సులు ఉమ్మడి జిల్లాలో ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ రీజియన్‌ నుంచి 8 డిపోల పరిధిలో 496బస్సులు శనివారం సేవలు అందించాయి. 339ఆర్టీసీ బస్సులు, 157 ప్రైవేట్‌(అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయడంతో ఉమ్మడి జిల్లాలో బస్సులు ప్రజలకు సేవలందించాయి.

యథావిధిగా తిరిగిన బస్సులు...
జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. యథావిధిగానే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను నడిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్‌ పరిధిలో 496 బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. 339 ఆర్టీసీ బస్సులు, 157 ప్రైవేట్‌ బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో మెదక్‌ డిపోలో 98బస్సులు ఉండగా 45బస్సులు తిరిగాయి. నారాయణఖేడ్‌ డిపోలో 57బస్సులు ఉండగా అందులో 51బస్సులను తిప్పారు. సంగారెడ్డి డిపోలో 100బస్సులు ఉండగా అందులో 96 బస్సులు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపోలో 105బస్సులకు 92 బస్సులు, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపోలో 69బస్సులకు 69 బస్సులు ప్రజలకు సేవలందించాయి. జహీరాబాద్‌ డిపోలో 93బస్సులకు 67బస్సులు, దుబ్బాక డిపోలో 40బస్సులకు 29 బస్సులు తిప్పారు. హుస్నాబాద్‌ డిపోలో 55బస్సులకు 47బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో రీజియన్‌ పరిధిలో బస్సులను నడిపారు.

ఎనిమిదో రోజు కార్మికుల నిరసనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. సంగారెడ్డిలోని కొత్త బస్టాండు ఎదుట ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మౌన దీక్ష నిర్వహించారు. వారికి బీజేపీ, సీపీఎం, ఏఐటీయూసీ నాయకులు మద్దతు ప్రకటించి మౌన దీక్షలో పాల్గొన్నారు.
తాత్కాలిక పద్ధతిలో మెకానిక్‌లు,

కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఇంటర్వ్యూలు..
ఆర్టీసీ సమ్మె కారణంగా తాత్కాలిక పద్ధతిలో మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, టైర్‌ మెకానిక్‌లు, డిపోల్లో పనిచేసేందుకు బీఎస్సీ కంప్యూటర్‌, ఎంసీఏ చేసిన వారిని నియమించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని మెదక్‌ రీజియన్‌ ఆర్‌ఎం రాజశేఖర్‌ తెలిపారు. ఆర్‌టీసీలో అప్రెంటీస్‌ చేసిన ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగి ఏదైనా ఏజెన్సీలో పనిచేసిన మెకానిక్‌లు ఈ నియామకానికి అర్హులన్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ కోసం బీఎస్సీ కంప్యూటర్‌, బీసీఏ చేసిన వారు అర్హులని సూచించారు. ఎంపికైన వారికి రోజుకు రూ.1000 వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సంగారెడ్డి, మెదక్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...