ప్రయాణం సాఫీగా..


Mon,October 7, 2019 12:27 AM

-ఉమ్మడి జిల్లాలో తిరిగిన 528 బస్సులు
-తాత్కాలికంగా 720 మంది డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సఫలం
-ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖల సమన్వయం
-డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకుల ఆందోళనలు

సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె ఉమ్మడి జిల్లాలో పాక్షికంగా జరిగింది. కార్మికులు తలపెట్టిన సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయడం వల్ల ప్రజా రవాణాకు ఎక్కడా బ్రేక్ పడలేదు. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల పరిధిలో 672 బస్సలు ఉంటే అందులో 528 బస్సులు యథావిధిగా నడిచాయి. 358 ఆర్టీసీ బస్సులు, 170 ప్రైవేట్(అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. శనివారం కూడా సంగారెడ్డిలోని ఆర్టీఏ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేసే డ్రైవర్లను ఎంపిక చేశారు. అదే విధంగా సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో వద్ద ఉదయం నుంచి కండక్టర్ల నియామకం చేపట్టారు. కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నూతనంగా తాత్కాలిక పద్ధతిలో విధుల్లో చేరిన కార్మికుల ద్వారా బస్సులను ఉమ్మడి జిల్లాలో సాయంత్రం వరకు 528 బస్సులు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాయి.

కనిపించని సమ్మె ప్రభావం...
ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మెదక్ రీజియన్ పరిధిలో ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉదయం 5.00 గంటల నుంచే బస్సులు యథావిధిగా తిరిగాయి. తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను తిప్పారు. మెదక్ రీజియన్ పరిధిలో ఆదివారం 528 బస్సులు తిరిగినట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పేందుకు రీజియన్ పరిధిలో 360 మంది డ్రైవర్లు, 360 మంది కండక్టర్లను నియమించారు. డ్రైవర్లు, కండక్టర్లుగా విధుల్లో చేరేందుకు నిరుద్యోగ యువకులు డిపోల ముందు బారులు తీరారు. ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన వారితో దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి వచ్చిన వారిలో అర్హులను విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపుతున్నారు. ఆదివారం కూడా తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఉత్సాహం ఉన్న వారికి ఇంటర్య్వూలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నారు. అదనంగా కొందరిని ఎక్కువగా విధులకు తీసుకుని అవసరం అయితే ఉపయోగించుకోనున్నారు.

ఉమ్మడి జిల్లాలో 528 బస్సులు ద్వారా సేవలు..
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో 528 బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చారు. తాత్కాలిక పద్ధతిలో బస్సులను తిప్పేందుకు రీజియన్‌లో 350 మంది డ్రైవర్లు, 350 మంది కండక్టర్లతో రీజియన్ పరిధిలోని 8 డిపోలలో ప్రయాణికులకు సేవలు అందించారు. 358 ఆర్టీసీ బస్సులు, 170 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8డిపోల పరిధిలో మెదక్ డిపోలో 61 బస్సులు, నారాయణఖేడ్ డిపోలో 45 బస్సులు, సంగారెడ్డి డిపోలో 97 బస్సులు, సిద్దిపేట డిపోలో 92 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోలో 71 బస్సులు, జహీరాబాద్ డిపోలో 77 బస్సులు, దుబ్బాక డిపోలో 35 బస్సులు, హుస్నాబాద్ డిపోలో 50 బస్సులు ప్రయాణికులకు సేవలు అందించాయి. ప్రయాణికులు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో రీజియన్ పరిధిలో బస్సులను నడిపారు.

డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఉదయం బస్సు డిపోల వద్ద మౌన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో జేఏసీ నాయకులు ఐబీ నుంచి కొత్త బస్టాండు వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండు ముందు బతుకమ్మ ఆటలు ఆడి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులుల సమ్మెకు సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించి కొత్త బస్టాండు ఎదుట ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

యథావిధిగా బస్సులు..
గుమ్మడిదల : మండల కేంద్రం మీదుగా ఆదివారం బాలానగర్ నుంచి మెదక్‌కు కొన్ని పల్లెవెలుగు బస్సులు నడిశాయి. బోదన్, బాన్సువాడ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు నడుస్తుండడంతో కొంతమేరకు ఇబ్బందులు తప్పడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...