ఆగని ప్రయాణం


Sat,October 5, 2019 11:29 PM

-ఉమ్మడి జిల్లాలో తిరిగిన 380 ఆర్టీసీ బస్సులు
-తాత్కాలికంగా 500 మంది డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
-నేడు పూర్తి స్థాయిలో తిరుగనున్న బస్సులు
-ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అధికారులు

సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి/సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా జరిగింది. ఉదయం నుంచే ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులను జిల్లా వ్యాప్తంగా నడిపించారు. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 8డిపోల పరిధిలో 672బస్సులు ప్రతి రోజు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. కార్మికుల సమ్మెతో శనివారం అధికారులు 380బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారు. 250ఆర్టీసీ బస్సులు, 130ప్రైవేట్(అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. శుక్రవారం సంగారెడ్డిలోని ఆర్టీఏ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేసే డ్రైవర్లను ఎంపిక చేశారు. అదేవిధంగా సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో వద్ద ఉదయం నుంచి కండక్టర్ల నియామకం చేపట్టారు. నూతనంగా తాత్కాలిక పద్ధతిలో విధుల్లో చేరిన కార్మికులతో బస్సులను ఉమ్మడి జిల్లాలో తిప్పారు. దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్చలు చేపట్టాలని ఆదేశించడంతో ఆర్టీసీ అధికారులు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. వారి ద్వారా ఉదయం 5.00గంటల నుంచే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బస్సులను తిప్పారు.

కొనసాగిన సమ్మె..
మెదక్ రీజియన్ పరిధిలో కార్మికుల సమ్మె జరిగింది. ఉదయం 5.00గంటల నుంచే బస్సులు యధావిధిగా తిరిగాయి. మెదక్ రీజియన్ పరిధిలో శనివారం 380 బస్సులు తిరిగినట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పేందుకు రీజియన్ పరిధిలో 250మంది డ్రైవర్లు, 250మంది కండక్టర్లను నియమించారు. డ్రైవర్లు, కండక్టర్లుగా విధుల్లో చేరేందుకు నిరుద్యోగ యువకులు డిపోల ఎదుట బారులుదీరారు. కాగా, అధికారులు దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి అర్హులను విధుల్లోకి తీసుకుని బస్సులు నడుపుతున్నారు. ఆదివారం కూడా తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఉత్సాహం ఉన్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

రీజియన్‌లో తిరిగిన 380బస్సులు..
సమ్మె నేపథ్యంలో ఉమ్మడి రీజియన్ పరిధిలో ఆర్టీసీ అధికారులు శుక్రవారం 380బస్సులను తిప్పారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లతో రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో ప్రయాణికులకు సేవలు అందించారు. 250ఆర్టీసీ బస్సులు, 130ప్రైవేట్ బస్సులు తిరిగాయి. రీజియన్‌లోని 8డిపోల పరిధిలో మెదక్ డిపోలో-50బస్సులు, నారాయణఖేడ్ డిపోలో 30బస్సులు, సంగారెడ్డి-75 బస్సులు, సిద్దిపేట-90 బస్సులు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-55బస్సులు, జహీరాబాద్-30, దుబ్బాక-30, హుస్నాబాద్-25బస్సులు, ఆర్సీపురం డివిజన్‌లోని భెల్ డిపోలో మొత్తం 148బస్సులకు గాను ప్రైవేట్ డ్రైవర్లను నియమించి 53బస్సులను డిపో నుంచి బయటకు పంపించారు. ప్రయాణికులకు సేవలు అందించాయి. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో రీజియన్ పరిధిలో బస్సులను నడుపనున్నారు.

ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చర్యలు..
- మెదక్ రీజియన్ మేనేజర్ రాజశేఖర్
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. రీజియన్ పరిధిలో ఉన్న 672బస్సులను పూర్తిస్థాయిలో నడుపనున్నాం. శనివారం తాత్కాలికంగా విధులు నిర్వహించేందుకు డ్రైవర్లు, కండక్టర్లను నియమించి వారితో 380బస్సులు తిప్పాం. 250 ఆర్టీసీ, 130 ప్రైవేట్ బస్సులు ప్రజలకు సేవలు అందించాయి. కార్మికులకు శనివారం సాయంత్రం 6.00 గంటల వరకు విధుల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విధులకు హాజరుకాని వారిని విధుల్లోకి తీసుకోవడం జరుగదని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా అందరూ విధుల్లో చేరాలి.

డిపోల ఎదుట కార్మికుల ధర్నాలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయాలని కోరారు. సంస్థ పరిరక్షణకు తాము పాటు పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సమ్మెకు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...