కొత్త పాలసీ


Thu,October 3, 2019 11:59 PM

-నవంబరు 1 నుంచి నూతన మద్యం విధానం
-9 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
-దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు
-గతంలో కంటే దరఖాస్తు ఫీజు లక్ష పెంపు
-ఉమ్మడి జిల్లాలో 193 వైన్స్‌లు
-32 వరకు బార్లు
-18న కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా, వైన్స్‌లు కేటాయింపు
-3 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నవంబరు 1నుంచి కొత్త పాలసీ ప్రకారం వైన్స్‌ల్లో విక్రయాలు మొదలుకానున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 193 వైన్స్‌లున్నాయి. అలాగే, 32 వరకు బార్లు ఉన్నాయి. వైన్స్‌లకు ఈ నెల 9 నుంచి16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18న జిల్లా ఎక్సైజ్ కార్యాలయాల్లో కలెక్టర్లతో డ్రా తీయించి దుకాణాలు కేటాయించనున్నారు. రెండేండ్ల ప్రాతిపదికన 2021 అక్టోబరు 3తవరకు గడువు ఉంటుంది. రూ.లక్ష వరకు ఉన్న దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మరో లక్ష పెంచి రూ.2 లక్షలు చేసింది. ప్రతి దరఖాస్తుతో పాటు రూ.2 లక్షలు డీడీ రూపంలో చెల్లించాలి. ఈ డబ్బులు తిరిగి రావు. ఆదాయం రూపం లో ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లా పరిధిలో వైన్స్‌ల కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏబీకే శాస్త్రి నమస్తేతెలంగాణ ప్రతినిధితో వెల్లడించారు.

నవంబరు 1 నుంచి కొత్త పాలసీ...
నబంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ మొదలు కానున్నది.సెప్టెంబరు 30తేదీతో మద్యం పాలసీ ముగిసిన విష యం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో నెల అదనపు సమయం ఇచ్చింది. అక్టోబర్ 30తో పాత మద్యం పాలసీ ముగియనున్నది. నవంబర్ నెల నుంచి కొత్త పాలసీ ప్రారంభం కానున్నది. రెండేండ్ల లైసెన్స్ ప్రాతిపదికన 2021 నవంబరు 31వరకు వైన్స్‌లు కొనసాగనున్నాయి.

రాత్రి 10గంటల వరకే...
వైన్స్‌లు రాత్రి 10గంటల వరకే తెరిచి ఉండనున్నాయి. ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి తెరుచుకుని రాత్రి 10గంటల వరకు వైన్స్‌ల్లో విక్రయాలు జరుగనున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లోని వైన్స్‌లు మాత్రం ఉదయం 10 గం టల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. రజీహెచ్‌ఎంసీ పరిధిలోని వైన్స్‌లకు గంట ఎక్కువ సమయం కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ మూడు జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు వైన్స్‌లు సమయం పాటించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు లక్ష పెంపు...
వైన్స్ దరఖాస్తుకు ప్రభుత్వం లక్ష రూపాయలను అదనంగా పెంచింది. ప్రస్తుతం రూ.లక్ష ఉన్న (నాన్ రిఫండేబుల్) చలానాను రెండు లక్షలకు పెంచారు. వైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఉమ్మడి జిల్లాలో రెండేండ్ల క్రితం చేపట్టిన డ్రా కోసం 2,218 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 3వేల వరకు దాటే అవకాశమున్నదని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ప్రభుత్వానికి వెళ్లనున్నది. ఈ లెక్కన గతేడాది దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22.18 కోట్ల ఆదాయం లభించింది. ఈ సారి ఆదాయం రూ.30 కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డ్రా తీయనున్న కలెక్టర్లు...
ఈ నెల 16 నుంచి 19 వరకు మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల వద్ద దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రూ. 2 లక్షలకు సంబంధించిన డీడీని అందించాలి. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 18న ఆయా జిల్లాలో కలెక్టర్లు డ్రా తీస్తారు. డ్రా పద్ధతితో వైన్స్ దుకాణాల కేటాయింపు చేస్తారు. డ్రాలో వైన్స్ వచ్చిన వారు ప్రభుత్వం సూచించిన నింబంధన ప్రకారం నవంబరు నుంచి వైన్స్‌ల నిర్వహణ మొదలు పెట్టనున్నారు.

రూ.55 లక్షల స్లాబ్‌లో 90 వైన్స్‌లు
ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విభజించిన స్లాబ్‌ల ప్రకారం చూస్తే 55 లక్షల స్లాబ్‌ల పరిధిలోకి ఉమ్మడి జిల్లాలో 90 వైన్స్‌లు వస్తున్నాయి. రూ.50లక్షలు, రూ.55లక్షలు, రూ.60లక్షలు, రూ.65లక్షలు, రూ.85లక్షలు, రూ.1.10 కోట్లు స్లాబ్‌లకు సంబంధించిన వైన్స్‌లు జిల్లాలో ఉన్నాయి. మొత్తం 193 వైన్స్‌లు కాగా, సంగారెడ్డి జిల్లాలో రూ. 50లక్షల స్లాబ్ పరిధిలో 22, రూ.55లక్షల స్లాబ్ పరిధిలో 20, రూ. 60లక్షల స్లాబ్‌లో 20, రూ.1.10కోట్ల స్లాబ్ పరిధిలో 23 వైన్స్‌లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో రూ.50లక్షల స్లాబ్‌లో 10వైన్స్‌లు, రూ.55లక్షల స్లాబ్‌లో 28 వైన్స్‌లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో రూ.50లక్షల స్లాబ్ పరిధిలో 14, రూ.55 లక్షల స్లాబ్ పరిధిలో 42, రూ.65లక్షల స్లాబ్ పరిధిలో 14 వైన్స్‌లు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో 21, పటాన్‌చెరు 30, అందోల్ 9, జహీరాబాద్ 10, నారాయణఖేడ్ 10 మొత్తం 85 వైన్స్‌లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్ స్టేషన్ పరిధిలో 14, నర్సాపూర్ 13, రామాయంపేట 11 మొత్తం 33 వైన్స్‌లు, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట స్టేషన్ పరిధిలో 21, గజ్వేల్ 19, మిర్‌దొడ్డి 6, చెర్యాల 11, హుస్నాబాద్ 13 వైన్స్‌లు ఉన్నాయి.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...