చెత్తపై సమరం


Wed,October 2, 2019 11:33 PM

-మెగా శ్రమదానానికి విశేష స్పందన
-ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రజలు తోడ్పాటునందించాలి
-కలెక్టర్ హనుమంతరావు
-పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
-జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
-స్వచ్ఛతలో నెంబర్ వన్‌గా అందోలు-జోగిపేట మున్సిపాలిటీని తీర్చిదిద్దుదాం
-అభివృద్ధికి ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు
-ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
-సంగారెడ్డిలో ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి

అందోల్, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, ప్లాస్టిక్ వాడాకాన్ని సమూలంగా నిర్మూలిద్దామని.., గొనే సంచులను మాత్రమే ఉపయోగించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మెగా శ్రమదానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పచ్చ జెండా ఊపి శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 10 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని, నిర్మూలన కోసం ఇక్కడి నుంచి తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మెగా శ్రమదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ పనులతో పల్లెలన్నీ పరిశుభ్రతలో ప్రగతిని సాధిస్తున్నాయన్నారు. అదే దిశగా పట్టణాల్లోనూ శ్రమదానం నిర్వహించడం సంతోషకరమన్నారు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికీ తడిపొడి చెత్త డబ్బాలతో పాటు గోనె సంచులను అందజేస్తామన్నారు. జనాభా ప్రతిపాదికన బ్యాటరీ ఆపరేటర్ ట్రాలీలను ఏర్పాటు చేస్తామని, ట్రాక్టర్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని, వినియోగించుకోవాలన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.14 కోట్లు
- ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఈ నిధులతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల కంటే పరిశుభ్రతలో అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పూర్తిగా వెనుకంజలో ఉందని, రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ ఐ లవ్ మై సిటీగా అనుకొని స్వచ్ఛతలో ముందుండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కలెక్టర్ హనుమంతరావుకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషమన్నారు. మెగా శ్రమదానం కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం చాలా సంతోకరమని, ఆర్థికంగా సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.

ప్రజల మమేకంతో మెగా శ్రమదానం
అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో నిర్వహించిన మెగా శ్రమదానం కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పారిశుద్ధ్య పనులను చేపట్టేందుకు గాను 30 ట్రాక్టర్లు, 10 జేసీబీలు, 20 డోజర్లను ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన కుల సంఘాలు, వర్తక వ్యాపార, వాణిజ్య సంఘాలు, డ్వాక్రా సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని వార్డుల వారీగా ఎవరికి వారు శ్రమదానం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. రోడ్లను ఊడ్చడం, కలుపు మొక్కలను తొలగించడం వంటి ఇతర పారిశుద్ధ్య పనులను చేపట్టారు.

చెత్తను తొలిగించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే
అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో నిర్వహించిన మెగా శ్రమదానంలో కలెక్టర్ హనుమంతరావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, ఆర్డీవో శ్రీను పిచ్చి మొక్కలను తొలగించారు. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే స్వయంగా నడిపించారు. స్థానిక చేనేత సహకార సంఘం సమీపంలోని పిచ్చి మొక్కలను కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు తొలగించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో పడేసిన ప్లాస్టిక్ కవర్లను డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి, డీఎస్‌పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ తిరుపతిరాజు, వ్యవసాయ ఏడీఏ అరుణ, ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మిబాయిల ఆధ్వర్యంలో సేకరించారు. పీఆర్ ఈఈ వేణుమాధవ్‌రావు, మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫసహాత్ ఆలీబెగ్, డిప్యూటీ ఈఈ రామారావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్, ఏఈ కురుమయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పి.నారాయణ, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్‌లతో పాటు పలువురు చెత్తాచెదారాన్ని తొలగించి ట్రాక్టర్లల్లో వేశారు. అనంతరం కాలనీల్లో ద్విచక్ర వాహనాలపై పర్యటిస్తూ పనులను పర్యవేక్షించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...