ప్రగతి తోవలో.. కార్యదర్శులు


Tue,September 17, 2019 11:51 PM

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న సీనియర్లకు ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీలో పల్లెల్లో అభివృద్ధి కొంత పుంతలు తొక్కుతున్నది. 30 రోజుల ప్రణాళికలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని పోస్టులను భర్తీ చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు నియామకాలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలుండగా ఇప్పటికే పనిచేస్తున్న సెక్రెటరీలు 195 మంది ఉండగా మిగతా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పాత వారిలో 11 మందికి ప్రమోషన్లు రాగా, 376 మందిని కొత్తగా నియమించారు. మరో 87 మంది నియామకానికి అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇప్పటికే పరీక్ష రాసిన వారిలోంచి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని డీపీవో వెంకటేశ్వర్లు తెలిపారు.

విధుల్లో 376 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
కొత్తగా నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో బిజీ అయిపోయారు. ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలోనే సర్కారు వేగంగా నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలో కొత్తగా 376 కార్యదర్శులు నియామకమయ్యారు. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలున్నాయి. కొత్త పంచాయతీలు ఏర్పాటైన నేపథ్యంలో కార్యదర్శుల కొరత తీవ్రమైన విషయం తెలిసిందే. జిల్లాలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు 195 మంది ఉండగా వారికే 3 నుంచి 4 పంచాయతీలను అప్పగించారు. పంచాయతీల్లో పాలనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం జూనియర్ కార్యదర్శులకు నియామకం చేపట్టింది. పరీక్షలు నిర్వహించి నియామకాలు చేసింది. 195 మంది పనిచేస్తుండగా మిగతా ఖాళీలకు పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. మొదటి విడుతలో మొత్తం 381 మందికి నియామక ఆర్డర్లు ఇచ్చారు. అయితే అందులో 357 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వారిలోంచి మరో 24 మంది వరకు ఇతర ఉద్యోగాలు రావడంతో రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. అంటే మొదటి విడుతలో ఉద్యోగంలో చేరిన వారు 333 మంది సెక్రెటరీలుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవలే రెండో విడుత నియామకాలు కూడా చేపట్టారు. ఇందులో 78 మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానించగా, 52 మంది హాజరయ్యారు. వీరిలో 43 మందికి అధికారులు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి విడుతలో 333 మంది, రెండో విడుతలో 43 మంది మొత్తం 376 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్లు, డీఎల్‌పీవోల నియామకం...
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకంతో పాటు డీఎల్‌పీవో (డివిజినల్ లెవల్ పంచాయతీ ఆఫీసర్)లను నియమించారు. అదేవిధంగా సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎంపీవోలుగా ప్రమోషన్లు ఇచ్చారు. గతంలో జిల్లాలో సంగారెడ్డి ఒక్కటే రెవెన్యూ డివిజన్ ఉండేది. కొత్త మండలాల ఏర్పాటు తరువాత నారాయణఖేడ్, జహీరాబాద్‌లను కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, మూడు రెవెన్యూ డివిజన్లకు డీఎల్‌పీవోలను నియమించారు. ఇతర జిల్లాలను నుంచి వచ్చిన వారు విధుల్లో చేరారు. ఇదిలాఉండగా జిల్లాలో 195 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులుండగా ఇందులో 11 మందికి ఎంపీవోలు ప్రమోషన్లు వచ్చాయి. అంటే 195 నుంచి మరో 11 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఖాళీలు ఏర్పాడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న మిగతా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 647 పంచాయతీలుండగా 184 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, కొత్తగా చేరిన 376 మంది కలిపి మొత్తం 550 మంది సెక్రెటరీలు విధులు నిర్వహిస్తున్నారు. మరో 87 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వాటిని భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...