రైతుకు ధీమా పింఛన్ పథకం


Wed,September 11, 2019 11:39 PM

-ప్రధానమంత్రి కిసాన్‌మాన్‌ధన్ యోజన
-18 నుంచి 40 ఏండ్ల రైతులకు పథకం వర్తింపు
-5 ఎకరాల లోపు సన్న, చిన్నకారు రైతులు అర్హులు
-జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు

సంగారెడ్డి చౌరస్తా : రైతులు పింఛన్ పథకంలో చేరి భరోసాతో జీవించాలని జిల్లా వ్యవసాయాధికారి నరసింహారావు ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం రైతు పింఛన్ కోసం పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ ఎల్‌ఐసీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం పింఛన్ పథకం ప్రారంభించిందన్నారు. 18నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న సన్న, చిన్నకారు రైతులు అర్హులన్నారు. అయితే ఐదెకరాల లోపు భూమి ఉండాలని స్పష్టం చేశారు. 60ఏండ్లు వయస్సు దాటిన తర్వాత వారికి నెలకు రూ.3వేల చొప్పున పింఛన్ వస్తుందన్నారు.

వయస్సు ఆధారంగా రూ. 55 నుంచి రూ.200 వరకు ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే సామాజిక భద్రత పథకాలలో ఉన్న వారు, ప్రధానమంత్రి శ్రమయోగిమాన్‌ధన్ యోజన, సంస్థాగత భూములు కలిగిన, రైతు కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఉన్నట్లయితే పథకానికి అనర్హులన్నారు. ఆదాయపు పన్ను కట్టేవారు, వృత్తి ఉద్యోగులు రూ.10వేల పైనా తీసుకునే విశ్రాంత పింఛన్‌దారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, జిల్లా పంచాయతీ చైర్మన్లు కూడా అనర్హులన్నారు.

యూరియా కొరతలేదు
జిల్లాలో యూరియా కొరతలేదని వ్యవసాయ శాఖ జేడీ స్పష్టం చేశారు. జిల్లాలో 18వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 17వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే వచ్చిందన్నారు. అయితే ఇఫ్కో ద్వారా బుధవారం మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో 500 మెట్రిక్ టన్నులు గురువారం వచ్చే అవకాశం ఉన్నదన్నారు. సమావేశంలో పోతులబొగూడ రైతు సమన్వయ సమతి అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, మనూర్ మాజీ ఎంపీపీ మోహన్‌రావు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...