ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ భేష్


Wed,September 11, 2019 11:36 PM

సంగారెడ్డి చౌరస్తా : క్షేత్రస్థాయిలో ఈ-పాస్ ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్న విధానంపై రాష్ట్ర ఆహార సంస్థ చైర్మన్ తిరుమల్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలు పరిశీలనలో భాగంగా బుధవారం రాష్ట్ర ఆహార సంస్థ కమిటీ రెండు బృందాలుగా ఏర్పడి జిల్లాలో పర్యటించింది. ఈ క్రమంలో తిరుమల్‌రెడ్డి సంగారెడ్డిలోని 34, 35 రేషన్ దుకాణాలను సందర్శించి కార్డుదారులకు సరుకుల పంపిణీ తీరు పరిశీలించారు. నూతనంగా ఈ-పాస్ విధానంలో సరుకుల పంపిణీ బాగున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. పొర్టబులిటీ ద్వారా రేషన్ పొందుతున్న వినియోగదారులు జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా సరుకులు పొందడం గురించి వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విజయనగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, పోతిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. అక్షయ పాత్ర ద్వారా పంపిణీ చేస్తున్న ఆహార నాణ్యతపై విచారించారు. విజయనగర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు అక్కడ పిల్లలకు పంపిణీ చేస్తున్న ఆహారం, పాలు, గుడ్ల పంపిణీ, బాలామృతం, గర్భిణుల పోషకాహారంపై అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్న పిల్లలతో మాట్లాడి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం కంది మండలంలోని అక్షయ పాత్ర సంస్థకు వెళ్లి ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పిల్లలకు అధిక పోషక విలువలు గల ఆహార పదార్థాలు అందించాలనే పలు సూచనలు చేశారు. సంగారెడ్డిలోని సివిల్ సైప్లె గోదాంను సందర్శించి అక్కడ నిల్వ ఉన్న పీడీఎస్ బియ్యం, సన్నబియ్యం, చక్కెర, సీజ్ చేయబడిన పీడీఎస్ బియ్యంపై ఆరా తీశారు. కమాండ్ కంట్రోల్‌లోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావును కలిసిన కమిటీ జిల్లాలో అమలవుతున్న ఆహార భద్రత చట్టంపై చర్చించారు. అంతకుముందు కలెక్టరేట్ ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలకు జాతీయ ఆహార భద్రత చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వి. ఆనంద్, బి.సంగులాల్, కె.గోవర్ధన్‌రెడ్డి, ఆర్.శారద, ఎం. భారతి, కలెక్టర్ హనుమంతరావు, జేసీ నిఖిల పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...