ఆన్‌లైన్‌లో పేరు మాయంపై రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా


Wed,September 11, 2019 11:35 PM

జిన్నారం : నమస్తే తెలంగాణలో వచ్చిన బామన చెరువు కబ్జా కథనం రెవెన్యూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సర్వే నంబర్ 510లోని 4.10 ఎకరాల చెరువు శిఖాన్ని, ఎఫ్‌టీఎల్‌ను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి హద్దులు గుర్తించామని అనుకుంటున్న సమయంలో సర్వే నంబర్ 508లో 3 ఎకరాలు కొనుగోలు చేసిన వెంకటేశ్ నాయక్ అనే పట్టాదారుడి పేరు రికార్డుల్లో నుంచి మాయమవడంపై రెవెన్యూ అధికారులను కొత్త ఇబ్బందులోకి నెట్టింది. చెరువు పైభాగంలోని సర్వే నంబర్ 508లో 3ఎకరాల భూమిని 2007లో కొనుగోలు చేశానని వెంకటేశ్‌నాయక్ తెలిపారు. పదిహేను రోజుల క్రితం వరకు ఆన్‌లైన్‌లో ఉన్న తన పేరు ఇప్పుడు కనిపించడం లేదని వెంకటేశ్‌నాయక్ తెలిపారు. తన పేరుతో వచ్చిన పాసు పుస్తకాలు, పహణీలు ఉన్నాయన్నారు. తన పొలంలో ఎవరో మట్టి వేసి చదును చేసినట్లు తెలియడంతో వచ్చి చూస్తే కడీలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో తన పేరు లేకపోవడంపై వీఆర్వోను అడిగితే తప్పించుకుంటున్నారని చెప్పారు.

కాగా బుధవారం బాధితుడు వెంకటేశ్‌నాయక్‌కు మద్దతుగా ఊట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవి, పలువురు గ్రామస్తులు రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఊట్ల నుంచి వీఆర్వో మహమూద్‌ను తొలిగించాలని డిమాండ్ చేశారు. కాగా బామన చెరువు కబ్జా కథనంతో ఇలాంటి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పేరు తొలిగింపు కావాలనే జరిగిందా.. పొరపాటున జరిగిందా అనేది చర్చగా మారింది. ఇదంతా రెవెన్యూ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు ఓ పథకం ప్రకారం చేసిన కుట్ర అని బాధితుడు వాపోయాడు. సర్వే నంబర్ 508కి సంబంధించిన రికార్డులను చూపించాలని వీఆర్వోను కోరగా తన వద్ద రికార్డులు లేవంటున్నారని ఊట్ల సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు. రికార్డుల్లో నుంచి తొలిగించిన తన పేరును చేర్చాలని తహసీల్దార్ రామ్మోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...