ఘనపురానికి.. నిధుల వరద


Tue,September 10, 2019 11:45 PM

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లాలో ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుకు తాజాగా సీఎం కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో రూ.34కోట్లు ఎత్తు పెంపు కాల్వల ఆధునీకరణ కోసం నిధులు కేటాయించడంతో ఘనపూర్‌ ప్రాజెక్టుకు పూర్వవైభవం సంతరించుకోనున్నది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఘనపూర్‌ ప్రాజెక్టుకు నిధుల వరద ప్రారంభమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన ఘనపూర్‌ ప్రాజెక్టును 2014 డిసెంబర్‌ 17న సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే నిర్వహించి, రూ.100కోట్లు నిధులు కేటాయించారు. ప్రాజెక్టు కుడి కాల్వ మహబూబ్‌నహర్‌ 43 కిలో మీటర్లు, ఎడమ కాల్వ ఫతేనహర్‌ 39కిలో మీటర్లుగా ఉన్నది. ఈ ప్రాజెక్టు మెదక్‌, కొల్చారం, పాపన్నపేట, ఘవేళిఘనపూర్‌ మండలాల పరిధిలోని 21,625 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 35వేల నుంచి 45 వేల ఎకరాల వరకు ప్రతి సంవత్సరం రెండు పంటలు సాగయ్యేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పూడిక పేరుకుపోయి 0.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు 0.135కి పడిపోయింది. రైతు బిడ్డగా మెదక్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా సీఎం కేసీఆర్‌ ఘనపూర్‌ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఘనపూర్‌ ప్రాజెక్టుకు పూర్వవైభవం రానున్నది. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిల ప్రత్యేక కృషితో మళ్లిపోయిన జైకా నిధులు 24.65కోట్లు మళ్లీ తెప్పించి, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల సిమెంట్‌ లైనింగ్‌ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.

మొదటిసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హరీశ్‌రావు ఆ మరుసటి రోజే మెదక్‌కు చేరుకుని ఘనపూర్‌ ప్రాజెక్టుకు సిమెంట్‌ కాల్వల లైనింగ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తైనప్పటికీ ఇంకా ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణ సిమెంట్‌ లైనింగ్‌ పనులు నిర్వహించాల్సి ఉన్నది. అంతేకాకుండా ప్రాజెక్టు ఎత్తుపెంపుకోసం రూ.43కోట్లు గతంలోనే మంజూరైనప్పటికీ భూ సేకరణ ఇంకా పూర్తికావాల్సి ఉన్నది. అందుకు 13.2కోట్లు నిధులు మంజూరై ఉన్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి పనులు కొంత వరకు జరిగాయి. ప్రాజెక్టు ముందు భాగంలో ప్రొటెక్షన్‌ వర్క్‌ (ఆప్రాన్‌వర్క్‌) పూర్తి కావచ్చింది. ప్రాజెక్టు ఎత్తు పెంపుకోసం భూ సేకరణ పూర్తి కావల్సివుంది. ఇప్పటి అంచనాలకు అనుగుణంగా రూ.13.2కోట్లకు ఇంకా అధనంగా నిధులు అవసరమవుతాయి. అందుకనుగుణంగానే తాజా బడ్జెట్‌లో సీఎం కేసీఆర్‌ ఘనపూర్‌ ప్రాజెక్టుకు రూ.34కోట్లు నిధులు కేటాయించారు. గతంలో కేటాయించిన రూ.100కోట్లకు తోడు రూ.34కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తు పెంపుతో పాటు కాల్వల ఆధునీకరణ పనులు పూర్తికానున్నాయి. త్వరలో ప్రాజెక్టు ఎత్తుపెంపు, కాల్వల ఆధునీకరణ పనులు పూర్తిచేసి రైతులకు చివరి ఆయకట్టుకు నీరందించాలని సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే జైకా నిధులతో ప్రాజెక్టు పరిధిలోని కాల్వల సిమెంట్‌ లైనింగ్‌ పూర్తి కావడంతో గత సంవత్సరం రెండు పంటలకు నీరందించారు.

ప్రాజెక్టు ఎత్తు పెంపు పూర్తయితే 0.3
టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం..
ప్రాజెక్టు ఎత్తుపెంపు పనులు పూర్తయితే 0.3 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని ఇరిగేషన్‌శాఖ ఈఈ ఏసయ్య, డీఈ శివనాగరాజు లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 21,625 ఎకరాలను సాగునీరు అందుతున్నది. ఎత్తుపెంపు పనులు పూర్తయితే మరో 5 నుంచి 6వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

హల్దీ, మంజీరాలపై 12 చెక్‌డ్యాంల నిర్మాణం...
సీఎం కేసీఆర్‌ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా మెదక్‌ జిల్లాకు హల్దీ, మంజీరా నదులపై 12చెక్‌డ్యాంలను నిర్మించడానికి నిధులు రూ.118.43 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే కూచన్‌పల్లి చెక్‌డ్యాం నిర్మాణం పూర్తైంది. ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ చెక్‌డ్యాం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లు చెక్‌డ్యాంకు ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం ఎనగండ్ల శివారులో నిర్మించిన చెక్‌డ్యాంను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...