మత్య్సకారులకు సర్కార్ భరోసా


Tue,September 10, 2019 04:29 AM

-మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
-ఉచితంగా చేపపిల్లలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం
-మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం..
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : మత్స్యకారులకు భరోసాను ఇచ్చింది తెలంగాణ సర్కార్ అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మత్స్యశాఖ అధికారులతో, సంఘాల నాయకులతో కలిసి ఎమ్మెల్యే పట్టణంలోని సాకీ చెరువులో చేపపిల్లలను వదిలారు. రూ.5 లక్షల 40వేల విలువైన 3 లక్షల చేపపిల్లలను చెరువులోకి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలే ప్రణాళిక ఉందన్నారు. ఇప్పటి వరకు నీరు చేరిన చెరువుల్లో చేపపిల్లలను వదులుతున్నామన్నారు. రోహు, కట్ల, మురుగల రకాల చేప పిల్లలను అధికారులు మత్స్యకారులకు అందిస్తున్నారన్నారు. గతంలోనైతే మత్స్యకారులు చేపపిల్లలను కొనుగోలు చేసి చేపల పెంపకం చేసేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రొత్సహకాలు అందిస్తున్నదన్నారు. చేప పిల్లలను పెంచడంతో పాటు పెరిగిన వాటిని స్టోరేజ్ చేసే బాక్సులను సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రజలు పౌష్టికాహారం వైపు మొగ్గు చూపుతుండడంతో చేపలకు డిమాండ్ ఏర్పడుతున్నదన్నారు. అందులో తెలంగాణలో పెరిగే చేపలు రుచిగా ఉంటాయన్నారు.

పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్ మాట్లాడుతూ సాకీ చెరువులో చేపపిల్లలను వదలడంతో మత్స్యకారులకు ప్రోత్సా హం లభిస్తున్నదన్నారు. అన్ని చెరువుల్లో నీరు వస్తే మత్స్యకారులకు మంచి ఉపాధి లభించేందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి సుజాత, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీశైలం, జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, నాయకులు మాణిక్‌ప్రభు, నాగసాని సత్తయ్య, ఎట్టయ్య, మెట్టు కుమార్ యాదవ్, విజయ్‌కుమార్, నర్రా భిక్షపతి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి..
కంగ్టి : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మత్య్సశాఖ జిల్లా అధికారి సుజాత అన్నారు. సోమవారం మండలంలోని కాకివాగు ప్రాజెక్ట్‌లో 2.24లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతిచెరువులో ఉచితంగా చేపపిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో చేపపంట చేతికి వస్తుందని, వీటిని అమ్ముకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. చేపలను అమ్ముకునేందుకు మత్స్యకారుల కోసం ఉచితంగా నాలుగు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు సబ్సీడిపై అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని చాప్టా(బీ) చెరువులో సైతం ఇటీవలే చేప పిల్లలను వదలడం జరిగిందని పేర్కొన్నారు. మత్స్యకారులు తప్ప ఇతరులు చెరువుల్లో చేపలను పట్టొద్దని సూచించారు. ఒకవేళ పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కోట ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకుడు వెంకట్‌రెడ్డి, సురేందర్‌రావు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...