పోషకాహార మాసం


Sat,September 7, 2019 11:46 PM

-సెప్టెంబర్‌లో నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి
-పోషకాహార లోపం రహిత జిల్లా వైపు అడుగులు
-ప్రజల భాగస్వామ్యంతో ముందుకు..
-రెండేండ్లలోపు పిల్లలకు ప్రత్యేక ప్రణాళిక
-క్షేత్రస్థాయిలో పారదర్శక కార్యక్రమాలు
-ఏటా రెండుశాతం మరణాలు తగ్గించడమే లక్ష్యం

సంగారెడ్డి చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. చిన్న పిల్ల లు, గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలలో పౌష్టికాహారలోపం లేకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా ప్రకటించారు. ఇప్పటికే పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసి జాతీయ అవార్డును జిల్లా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాను పోషకాహారలోప రహితంగా మార్చేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ నెల మొదటి వారంలో వివిధ సమన్వయ సమావేశాలు, ప్రణాళికలతో పోషణ మాసాన్ని ప్రారంభించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న క్రమంలో తమ విధులు నిర్వహించనున్న ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు అదే పనిలో పోషణ మాస ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకు 30రోజుల ప్రణాళిక గ్రామసభలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. ఈ నెల 6న నిర్వహించిన గ్రామసభల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ద్వారా వారికి పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు అవకాశం లభించింది. జాతీయస్థాయి అవార్డును అందుకున్న స్ఫూర్తితో పోషణ మాసాన్ని నిర్వహిస్తామని మహిళా సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పోషణమాసంలో ఆ నాలుగు అంశాలు..
నెలరోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న పోషణమాసం కార్యక్రమంలో భాగంగా నాలుగు అంశాలపై దృష్టి సారించనున్నారు. మొదటి అంశం 1000 రోజుల వయస్సు ఉన్న చిన్నారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనగా పుట్టిన శిశువు నుంచి రెండేండ్లలోపు వరకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించడం. రెండో అంశంలో భాగంగా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలలో రక్తహీనతను గుర్తించి వారికి అవగాహన కల్పించడం. మూడో అంశం డయేరియాపై దృష్టి సారించి డయేరియాకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తారు. నాలుగో అంశం కింద చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా పారిశుధ్యాన్ని పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. ఆయా కార్యక్రమాలను అంగన్‌వాడీల ద్వారా నిర్వహించడంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పోషకాహారం-పరిశుభ్రత అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే సంబంధిత ఉత్తర్వులను కూడా విద్యాశాఖకు అందించినట్లు మహిళా సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు.

రక్తహీనతకు సంబంధించిన కారణాలు, తెలుసుకుని పోషకాహారలోపం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. అన్ని పాఠశాలల పరిధిలో విద్యార్థులతో ప్రభాతబేరి నిర్వహించి ఈ నాలుగు అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. పాఠశాలలతో పాటు డిగ్రీ కళాశాల్లోనూ ఆయా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి గ్రామసభలో ప్రతిజ్ఞ చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోషణమాసంలో ముఖ్యంగా 1000 రోజులలోపు పిల్లలపై దృష్టి సారించి వారి ఆరోగ్య పటిష్టతకు కృషి చేయనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలను తాగించడంతో పాటు ఆరు నెలల వరకు తల్లిపాలను ఇప్పించడం, ఏడో నెల నుంచి అనుబంధ పోషకాహారం అందించడం, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను పట్టించడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా వివిధ రకాల కారణాలతో 28శాతం శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా ఏటా రెండుశాతం మరణాలు తగ్గించేందుకు లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

పోషణ్ అభియాన్ అనగా...
దేశంలో పోషణలోపం, రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ లక్ష్యం నెరవేరలేకపోయింది. ఈ క్రమంలో జన పోషణ్ టెక్నాలజీ సహాయంతో లబ్ధిదారులకు శ్రేష్టమైన ఆహారాన్ని అందించేలా చేసి వారి ప్రవర్తన, వైఖరిలో సానుకూల మార్పులను తీసుకొచ్చేందుకు నిర్ణయించిన పథకమే పోషణ్ అభియాన్. ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక ఉద్యమమే పోషణ్ అభియాన్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, పాఠశాల కమిటీలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజా సంఘాలు విస్తృతంగా పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపేందుకు కార్యాచరణ చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌కు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. ఈ దిశగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున మార్పు రావడంతో ఈ సెప్టెంబర్ మాసాన్ని పోషణమాసంగా నిర్వహిస్తున్నారు.

సర్పంచ్‌లకు సూచనలు ఇలా..
ఇదిలా ఉండగా, పోషణ మాసాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలకు పలు సూచనలు చేయబడ్డాయి. సర్పంచ్‌కు సూచించిన వాటిలో గ్రామ ప్రజలు పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించడం, ఆడ పిల్లల వివాహా వయస్సు కనీసం 18 ఏండ్లు ఉండేలా తల్లిదండ్రులను చైతన్య పర్చడం, గ్రామంలో ప్రతి గర్భిణి మహిళ ప్రసవం కోసం దవాఖానకు వెళ్లేలా చూడడం, ప్రతి వ్యక్తి మరుగుదొడ్డిని వినియోగించేలా సూచించడం, పేరటిల్లో కూరగాయలు పండించేలా ప్రజలను చైతన్యం చేయడం, సురక్షిత నీరు సరఫరా చేయించడం, గ్రామ స్వచ్ఛత కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించే సూచనలు పాటించాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీ టీచర్లకు..
అంగన్‌వాడీ టీచర్లకు జారీ చేసిన సూచనలలో పౌష్టికాహారానికి సంబంధించిన చార్ట్‌లు, వివరాలను ప్రజలకు అందించడం, పిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయించడం, పిల్లల శారీరక ఎదుగుదలకు తోడ్పాటు అందించడం, గర్భిణులు, శిశువులను పరిశీలించేందుకు వారి ఇళ్లను సందర్శించడం. పిల్లల వయస్సు, బరువు, ఎన్‌సీపీ కార్డుతో నమోదు చేయడం. తక్కువ బరువు కలిగిన పిల్లలను ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి.

ఆశ కార్యకర్తలు..
గ్రామంలో క్షేత్రస్థాయిలో విస్తృతమైన సేవలు అందించే కీలక బాధ్యత ఆశవర్కర్లపై ఉన్నది. గర్భవతులను కచ్చితంగా దవాఖానకు పంపి అక్కడే ప్రసవం జరిగేలా చూడడం, వారికి ఏఎన్‌సీ పరీక్షలు నిర్వహించడం, గర్భిణులు, నవజాతిశిశువుల ఇంటికి 9సార్లు వెళ్లి వారిని పరిశీలించడం, చాలా తక్కువ బరువు గల బిడ్డల ఇంటికి ప్రతినెలా వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు సరైన సమయంలో టీకాలు వేయించే బాధ్యత వీరిపై ఉన్నది.

పోషణ్ అభియాన్‌తో ప్రయోజనం..
జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జన చైతన్యం కోసం పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలందరూ భాగస్వాములను చేయడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. దీంతో శక్తవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు గట్టి పునాది ఏర్పడుతుందని ప్రభుత్వ విశ్వాసం. ముఖ్యంగా పోష ణ్ అభియాన్‌తో గర్భిణులు, బాలింతలు, శిశువులు, కౌమార బాలికలు, చిన్నారులకు ప్రయోజనం చేకూరుతున్నది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...