రాష్ట్ర స్థాయికి 8 ప్రాజెక్టుల ఎంపిక


Sat,September 7, 2019 11:43 PM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం స్థానిక బైపాస్‌రోడ్డులోని జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన సైన్స్ దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 166 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. మొత్తం ఐదు ఉప అంశాలను నిర్వహించిన సెమినార్‌లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. 166 ప్రాజెక్టులను పరిశీలించిన న్యాయనిర్ణేతలు అందులోని 8 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డీఈవో విజయలక్ష్మి మాట్లాడుతూ నూతన ఆలోచనలు- సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయోనని పిల్లలు తమ ప్రదర్శనల ద్వారా మెప్పించారని ప్రశంసించారు. తమ ఆలోచనలకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలకు కృషిచేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆమె ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించి జాతీయ పోటీలకు వెళ్లాలని విజేతలను ఆమె ప్రోత్సహించారు. ఇదిలా ఉండగా, బి.తిరుమల (జడ్పీహెచ్‌ఎస్- కంది) బి.కృష్ణ (జడ్పీహెచ్‌ఎస్- కన్సాన్‌పల్లి), సంజన (టీఎస్‌ఎంఎస్-బొల్లారం), ఎం.కుసుమాంజలి (మాస్టర్‌మైండ్ స్కూల్-పటాన్‌చెరు), టి .మేఘన (సెయింట్ ఆర్నాల్డ్స్-ఆర్సీపురం), పి.సాయి సుమోహన (విద్యాభారతి హైస్కూల్-బీహెచ్‌ఈఎల్), బి.మనీష (జడ్పీహెచ్‌ఎస్- పటాన్‌చెరు), నసీయా (కరుణాస్కూల్-సంగారెడ్డి) రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో వీరు పాల్గొననున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్, రిసోర్స్‌పర్సన్ ఆర్.వెంకటేశం, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...