ఆచార్య దేవో భవ


Fri,September 6, 2019 11:21 PM

-ఉపాధ్యాయుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
-సీఎం కేసీఆర్ పాఠశాలల్లో వసతులను పెంచారు
-ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
-విద్యార్థుల భవిత టీచర్ల చేతుల్లోనే...
-పాఠశాలల్లో వసతులను మెరుగుపర్చాం
-సీఎస్సార్ నిధులతో విద్యాలయాలకు పక్కా భవనాలు..
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
-పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

పటాన్‌చెరు, నమస్తేతెలంగాణ : చరిత్రలో గురువు స్థానం పెద్దదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పటాన్‌చెరులోని జీఎమ్మార్ గార్డెన్‌లో పటాన్‌చెరు నియోజకవర్గ ఉత్తమ టీచర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు 98మందిని ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు, పట్టువస్ర్తాలు బహూకరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో గురువుకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ప్రపంచానికే విజ్ఞానాన్ని పంచిన గొప్ప గురువులు మనదేశంలోనే కనిపిస్తారని అన్నారు.

గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఉచితంగా పుస్తకాలను, రెండు జతల బట్టలను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉంటున్నామన్నారు. ఉపాధ్యాయులు భావిభారత పౌరులకు మంచి విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందిస్తామని అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందన్నారు. విద్యార్థిలో స్ఫూర్తి నింపుతూ జ్ఞానాన్ని పెంచే కీలకమైన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఉపాధ్యాయుల శ్రమ, పట్టుదల, విజ్ఞానం కారణంగా మంచి ఫలితాలను చూస్తున్నామన్నారు. ఈ మారు పదిలో ఉత్తమమైన ఫలితాలను సాధించాలని కోరారు. నవంబర్ నెలలో ఉపాధ్యాయులకు క్రీడాపోటీలను పెడుతున్నామని, వాటిని విజయవంతం చేయాలని సూచించారు.

దాని తరువాత నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ క్రీడాపోటీలు పెట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం, జిల్లాస్థాయితోపాటు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తామని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ప్రముఖ గాయకుడు రాజ్‌కుమార్ పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ కుంచాల ప్రభాకర్, జడ్పీటీసీలు సుప్రజ వెంకట్‌రెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్లదేవానంద్, సద్ది ప్రవీణ, రవీందర్‌గౌడ్, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్‌రెడ్డి, తొంట అంజయ్యయాదవ్, ఏఎమ్సి చైర్‌పర్సన్ పుష్పనాగేశ్, నాయకులు దశరథరెడ్డి, చంద్రారెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, ఎంఈవో పీపీ రాథోడ్, వివిధ ఉపాధ్యాయ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...