పల్లె మురిసేలా..తండాబాట


Fri,August 16, 2019 10:57 PM

-కొత్త కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం
-20న ఎర్దనూర్ తండా నుంచి మొదలు
-వారంలో రెండు రోజులు జిల్లా అధికారుల తండాబాట
-అన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారించే ఏర్పాట్లు
-జిల్లాలో మొత్తం 74 తండాలు
-ఎర్దనూర్ తండాలో ఏర్పాట్లు పరిశీలించిన డీపీవో, ఇతర అధికారులు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. పల్లెలు బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నది. అర్హులందరికీ చేరడంతో పాటు సమస్యలు లేని పల్లెసీమలు తయారు కావాలనేది ప్రభుత్వం లక్ష్యం. లక్ష్యం నెరవేర్చడం కోసం కలెక్టర్ హనుమంతరావు నడుంబింగించారు. జిల్లాలోని తండాలు, పల్లెల్లో సమస్యల పరిష్కారానికి కొత్త కార్యక్రమం చేపట్టారు. తండాబాట పేరుతో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు వారంలో రెండు రోజులు తండాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఆయా తండాల్లో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ నెల 20న కంది మండలంలోని ఎర్దనూర్ నుంచి తండాబాటను కలెక్టర్ ప్రారంభించనున్నారు. జిల్లాలోని 74 తండాల్లో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, శుక్రవారం ఎర్దనూర్‌లో ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో ముచ్చటించారు.

అన్ని శాఖల సమన్వయంతో...
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో తండాబాట కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో శ్రీనివాసరావు ఇతర అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. కార్యక్రమ విధివిధానాలను రూపొందించారు. ముం దుగా మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు బృందంగా ఏర్పడి పల్లెలు, తండాల్లో సమస్యలపై నివేదికలు రూపొందించారు. వాటిని అధికారులకు అందిస్తారు. అన్నిశాఖల జిల్లా అధికారులు బృందం నివేదికలను పరిశీలిస్తాయి. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం నిర్ణయించుకున్న రోజున నేరుగా జిల్లా, మండల స్థాయి అధికారులు తండాబాట పేరుతో గ్రామానికి వస్తారు. కలెక్టర్‌తోపాటు ఇతర జిల్లా అధికారులంతా ఉంటారు. ముందుగా గ్రామాన్ని పర్యటిస్తారు. ఆ తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడుతారు. వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇతర సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు.

తాగునీటి సమస్య మొదలుకొని..
తండాల్లో తాగునీటి సమస్య మొదలుకొని ఇతర అన్నింటినీ పరిష్కరించనున్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం హెల్త్‌క్యాంపు, పశువులకు వెటర్నరీ హెల్త్‌క్యాంపులు పెడతారు. మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందుతున్న తీరును పరిశీలిస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీలను సందర్శిస్తారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి సమస్యలుంటే పరిష్కరిస్తారు. పౌష్టికాహార లోపంతో ఉన్న గర్భిణులు, పిల్లలకు పోషణ్ అభియాన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తారు. స్వయం సహాయక సంఘాల పనితీరు, మరుగుదొడ్ల వాడకం, వ్యవసాయం, హార్టికల్చర్ అన్నింటిపై సమీక్షిస్తారు. కూరగాయల సాగుకు రైతుల నుంచి సాకారం కావాలనే అభ్యర్థనలు వస్తే వాటికి ఏం చేయాలో అక్కడే నిర్ణ యం తీసుకుంటారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు, పాసుపుస్తకాల్లో తప్పులు ఇతర సమస్యను పరిష్కరిస్తారు. అన్నింటిని పరిశీలించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తారు.

ఎర్దనూర్ తండా నుంచి శ్రీకారం..
ఈ కార్యక్రమాన్ని కంది మండలంలోని ఎర్దనూర్ తండాను నుంచి ప్రారంభించనున్నారు. కలెక్టర్‌తోపాటు అన్ని శాఖల అధికారులు గ్రామానికి రానున్నారు. ఇందుకోసం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిసి గ్రామంలో తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలను గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ భవనం కావాలని, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వాటిని డీపీవో, ఇతర అధికారులు నివేదికగా రూపొందించారు. ఈ నెల 20 తండాబాట ప్రారంభోత్సవం రోజున దాదాపుగా సమస్యలన్నీ పరిష్కరించేలా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిష్కారం కాని పెద్ద సమస్యలేమి ప్రజల నుంచి రాలేదు. దీంతో అన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తండాబాట వారంలో రెండు రోజులు..
జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలున్నాయి. ఇం దులో 74 తండాలున్నాయి. వీటిలో 3 మాత్రమే కొత్తగా ఏర్పడిన పంచాయతీలు కాగా, 71 తండాలు కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు కావడం గమనార్హం. కాగా, వారంలో రెండు రోజులు తండాబాట నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు నిర్ణయించారు. ఎర్దనూర్ నుంచి మొదలుకానున్న ఈ కార్యక్రమం 74తండాలకు విస్తరించనున్నది. ఒక వారంలో మూడు తండాల్లో కూడా తండాబాట చేపట్టే అవకాశాలున్నాయని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. ఇది అద్భుతమైన కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కలెక్టర్‌తో సహా అన్ని శాఖల జిల్లా అధికారులు అక్కడే ఉండడంతో సాధ్యమైంత వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. 20న ఎర్దనూర్‌లో జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ రూపొందించిన ఈ వినూత్న కార్యక్రమం విజయవంతం చేస్తామని డీపీవో ధీమా వ్యక్తం చేశారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...