మన పథకాలకు..దేశంలోనే గుర్తింపు


Thu,August 15, 2019 11:01 PM-అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
-అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు..
-అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు
-బంగారు తెలంగాణ సాధనలో అందరూ భాగస్వాములు కావాలి
-చిన్న జిల్లాల అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
-రైతులకు పెట్టుబడి, బీమాతో ధీమా..
-నిరుపేదలు ఆర్థికంగా స్థిరపడేందుకు గొర్రెలు, బర్రెల పంపిణీ...
-విద్యార్థులకు మెరుగైన విద్య
-మహిళా, శిశు సంక్షేమానికి కృషి..
-గీత కార్మికులకు ఉపాధి
-జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతి కృషి చేస్తున్నది. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. రాష్ర్టాన్ని ప్రగతి పతాన నడిపిస్తున్నది. ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు తోడ్పాటునందిస్తున్నది. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ ఇండ్లు, విద్యార్థులకు సన్నబియ్యం భోజనం, గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపడుతున్నది. ఈ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందుతున్నదని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలకు, ఇతర అన్ని వర్గాలకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె జిల్లా అభివృద్ధి, అమలవుతున్న కార్యక్రమాలను వివరించారు. వెల్లడించిన అంశాలు ఆమె మాటల్లోనే...

రైతులకు పెట్టుబడి, బీమాతో ధీమా..
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వానకాలంలో 1,98,650 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రైతుబంధు ద్వారా వానకాలంలో ఇప్పటి వరకు 1,35,597 మంది రైతులకు రూ.135.59 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు బీమా నుంచి ఇప్పటి వరకు 913 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.45.65 కోట్లు నామినీల ఖాతాల్లో జమచేశాం. 1328 మంది రైతులకు రూ.12.86 కోట్ల రాయితీతో బిందు, 540 మంది రైతులకు రూ.72 లక్షల రాయితీతో తుంపర సేద్యం పరికరాలు మంజూరు చేశాం. పండ్ల తోటల అభివృద్ధికి 322 మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై రూ.53 లక్షలు ఖర్చు చేశాం. 242 ఎకరాల్లో మల్బరీ సాగైంది. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 6 మంది లబ్ధిదారులకు షెడ్ల నిర్మాణానికి రూ.15.60 లక్షలు మంజూరు చేశాం. చెరుకు అభివృద్ధి మండలి ద్వారా 4,864 మంది రైతులకు రూ.40.94 లక్షలు సబ్సిడీ రూపంలో అందించాం. కేంద్రాలు ఏర్పాటు చేసి మినుములు, కందులు, జొన్నలు, శనగలు, మొక్కజొన్నలు కొనుగోలు చేశాం. 60 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8,356 మంది నుంచి 3.69 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65.34 కోట్లు రైతులకు చెల్లించాం. 3,75,694 కార్డులపై 8,102 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.16.17 కోట్లతో మార్కెట్ కమిటీల్లో అభివృద్ధి చేపట్టి, సదాశివపేట మార్కెట్‌లో ఈ-సర్వీసెస్ విధానం అమలు చేస్తున్నాం.

గొర్రెలు, బర్రెల పంపిణీ...
జిల్లాలో రెండో విడుతలో రూ.144 కోట్లతో 15,345 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. ఎస్సీ, ఎస్టీలకు 75, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో రూ.80 వేల విలువ చేసే పాడిగేదెను అందిస్తున్నాం. జిల్లాలో 1671 మందికి పాడి గేదెలను, 75 శాతం సబ్సిడీపై రూ.6.77 లక్షలతో 542 పెరటి కోళ్ల యూనిట్లు పంపిణీ చేశాం. ఈ ఏడాది జలాశయాల్లో రూ.2.43 కోట్ల విలువగల 3.23 కోట్ల చేపపిల్లల పెంపకం చర్యలు తీసుకుంటున్నాం. నీలి విప్లవం కింద 16 హెక్టార్లలో చేపల చెరువుల నిర్మాణానికి 12 మంది రైతులను ఎంపిక చేశాం. ప్రమాదవశాత్తు మరణించిన 10 మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందించాం. ఐదో విడుత హరితహారం కింద జిల్లాలో 3 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 5 ఫారెస్ట్ బ్లాకులను, అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేస్తున్నాం. క్షీణించిన అడవుల అభివృద్ధిలో భాగంగా 107 హెక్టార్లలో యాంత్రిక పద్ధతిలో పనులు చేపట్టాం. అటవీ సరిహద్దు కందకాల గట్లపైన 172 కిలోమీటర్ల మేర మొక్కలు నాటినం. ఆగస్టు 9న జిల్లా వ్యాప్తంగా 15.64 లక్షల మొక్కలు నాటినం.

949 ఆవాసాలకు రక్షిత తాగునీళ్లు...
మిషన్‌భగీరథ పథకం ద్వారా జిల్లాలో 949 ఆవాస గ్రామాలకు రక్షిత తాగునీళ్లు సరఫరా చేస్తున్నాం. జిల్లాలో వంద శాతం తాగునీరు సరఫరా అవుతున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 841 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, 2769 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి. మొత్తం 2,39,987 గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చాం. భూగర్భ జలాల పెంపునకు 10 రీచార్జ్ షాప్టులు నిర్మించాం. కేంద్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్ కింద జహీరాబాద్, ఝరాసంగం, కల్హేర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, న్యాల్‌కల్ మండలాల్లో 45 పరిశీలక బావులను స్థాపించి పక్షానికి ఒకసారి నీటి కొలతలను సేకరించి నమోదు చేస్తున్నాం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. జిల్లాలో 38వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. 625 స్వయం సహాయక సంఘాలకు రూ.24.53 కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేశాం. 2,206 స్వయం సహాయక సంఘాలకు రూ.23.50 కోట్లు స్త్రీనిధి కింద రుణాలు మంజూరు చేశాం. ఉపాధి హామీ కింద 70,634 కుటుంబాలకు 1,16,531 మందికి రూ.29.32 లక్షల పనిదినాలు కల్పించాం. జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకున్నాం.

మెరుగైన విద్య, వైద్య సేవలు....
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాం. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 10 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసి, 6,500 మంది పిల్లలకు మెరుగైన విద్యనందిస్తున్నాం. 10/10 జీపీఏ సాధనే లక్ష్యంగా కలెక్టర్ ఫోకస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వంద మంది ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్య బోధిస్తున్నారు. రూట్స్ కార్యక్రమం ద్వారా 10వ తరగతి విద్యార్థులకు పాసయ్యేందుకు పాఠశాల స్థాయిలో 60 రోజుల ప్రత్యేక పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 17 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలుండగా ఏడింటిలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించాం. వాటిలో 960 మంది బాలికలకు విద్యనందిస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలందిస్తున్నాం. జిల్లాలో 30,840 మందికి కేసీఆర్ కిట్లు అందించాం. సుమారు 60శాతం పైగా సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి. మల్లేపల్లి, అల్మాయిపేట, ఎల్గోయి, బోరంచ, చాప్టా-కె సబ్‌సెంటర్లను హెల్త్ వెల్ సెంటర్లుగా ఏర్పాటు చేశాం. ప్రతి గురువారం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం చేపట్టాం. టీఎస్ ఐపాస్ కింద 1424 పరిశ్రమలకు అనుమతులిచ్చాం. 95,363 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. రూ.5.40 కోట్ల రాయితీతో 173 యూనిట్లను స్థాపించి 427 మంది ఎస్పీ, ఎస్టీలకు ఉపాధి కల్పించాం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సుమారు 662 పరిశ్రమలు స్థాపించి 65,866 మందికి ప్రత్యక్షంగా, 70,212 పరోక్షంగా ఉపాధి కల్పించాం.

అన్ని వర్గాల విద్యార్థులకు అండగా...
2578 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.3.19 కోట్లు ఉపకార వేతనాల కింద చెల్లించాం. అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి కింద 19 మంది రైతులకు రూ.3.61 కోట్లు మంజూరు చేశాం. 390 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.89 లక్షలు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించాం. 9,593 మంది బీసీ విద్యార్థులకు రూ.1.72 కోట్లు, 9,819 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.2.73 కోట్ల రియింబర్స్ మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మంజూరు చేశాం. 15 మంది మైనార్టీలకు సీఎం ఓవర్ సిస్ కింద రూ.1.91 కోట్లు అందించాం. అదేవిధంగా గ్రాంట్ ఏయిడ్ పథకం కింద శ్మశాన వాటికలు, ప్రహరీల నిర్మాణానికి రూ.1.33 కోట్లు మంజూరు చేశాం. ఎంఎస్‌డీపీ కింద కోహీర్, జహీరాబాద్, న్యాల్‌కల్ మండలాల్లో రూ.24.33 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.50 వేలను వందశాతం సబ్సిడీ కింద 41 మందికి రూ.18.42 లక్షలు పంపిణీ చేశాం. షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా 50వేల విలువగల 768 యూనిట్లకు వందశాతం సబ్సిడీతో రూ.3.84 కోట్లు అందిస్తున్నాం. రూ.లక్ష నుంచి రూ.12 లక్షల విలువ గల 643 యూనిట్లకు రూ.14.60 కోట్లు ఇచ్చాం. షీ-క్యాబ్ పైలెట్ పథకం కింద జిల్లాలో 25 మంది ఎస్సీ యువతులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చాం. 23 మంది ఎస్సీ నిరుద్యోగ యువకులకు శాశ్వత లైసెన్స్‌తో కూడిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇప్పించాం. 30 మంది ఎస్సీ యువతులకు సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాం.

మహిళా, శిశు సంక్షేమానికి కృషి..
పోషణ్ అభియాన్‌లో జాతీయ స్థాయిలో బెస్ట్ జిల్లాగా అవార్డుకు ఎంపికైంది. పోషకలోపం లేని సమాజం ఏర్పాటుకు చైతన్యం తీసుకువస్తున్నాం. సమగ్ర బాలల పరిరక్షణలో ఆపరేషన్ ముస్కాన్‌లో 75 మంది బాలలను రక్షించి, 50 మందిని పాఠశాలల్లో చేర్పించాం. మిగతా 25 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాం. 3 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. మహిళా గృహ హింస రక్షణ చట్టం కింద 694 కేసులు, సఖీ సెంటర్ ద్వారా 150 కేసులు పరిష్కరించాం. 47 మంది బాధితులకు ఆశ్రయం కల్పించాం. యువజన సర్వీసుల విభాగంలో అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణకు రూ.2.30 కోట్లు మంజూరు చేశాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా శక్తిని వెలికి తీయడంలో భాగంగా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాం.

కోట్లతో రోడ్ల విస్తరణ, అభివృద్ధి...
జిల్లా కేంద్రాన్ని కలిపే రహదారుల విస్తరణలో భాగంగా రూ.54.65 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో 64 కిలోమీటర్ల విస్తరణ చేశాం. రూ.34 కోట్లతో 35 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్చాం. కోర్ నెట్ ప్లాన్ కింద రూ.40 కోట్లతో 12.54 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి చేశాం. రూ.35.33 కోట్లతో 20 వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఐడీఏ పాశమైలారం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.45 కోట్లు మంజూరయ్యాయి. పీఎంజీఎస్‌వై-2 కింద రూ.17.39 కోట్లతో 6 పనులు పూర్తి చేశాం. నాబార్డ్ ఆర్‌ఐడీఎఫ్ కింద 20 పనులకు రూ.16.51 కోట్లు మంజూరు కాగా, రూ. 8.98 కోట్లతో 8 వంతెనలు పూర్తయ్యాయి. జిల్లాలో 397 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించాం.

3,223 మంది గీత కార్మికులకు ఉపాధి
ప్రభుత్వం కల్లు దుకాణాల లైసెన్సు ఫీజు, చెట్టు పన్ను, బకాయిలను రద్దు చేసింది. గీత కార్మికులకు ఉపాధి అవకాశాలలో పెంపొందించడానికి 5 స్టేషన్ల పరిధిలో 8 లక్షల ఈత మొక్కలు నాటాం. 3,223 మంది గీత కార్మికుల కు టుంబాలకు జీవనోపాధి కల్పించాం. మద్యం దుకాణాలు, బార్ల ద్వారా లైసెన్సు ఫీజు ఏడాదికి రూ.76.28 కోట్లు ఆదాయం రూపంలో వస్తున్నది. జిల్లాలో 3,25,776 మం ది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశాం. ఆపద్భంధు పథకం కింద 27 మందికి రూ.13.50 లక్షల ఆర్థిక సాయం అందించాం. నిర్భంధ తనిఖీలు చేపడుతూ నేరాలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలను విచారించి నేరస్తులను పట్టుకోవడానికి సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేశాం. జిల్లా అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, న్యాయాధిపతి, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, పాత్రికేయులు, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్... జై తెలంగాణ. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిఖిల, అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్, అన్ని జిల్లా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...