పల్లెకు పచ్చలహరం


Wed,August 14, 2019 11:26 PM

-జిల్లా వ్యాప్తంగా జోరుగా హరితహారం
-జిల్లా టార్గెట్ 2.88 కోట్లు
-ఇప్పటి వరకు నాటిన మొక్కలు 61.13 లక్షలు
-ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు
-మొక్కలు నాటుతున్న అన్నివర్గాల ప్రజలు

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి : జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటుతున్నారు. ఈసారి జిల్లాలో 2.88 కోట్ల వరకు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లాలో 61.13 లక్షల మొక్కలు నాటారు. రోడ్లకు ఇరువైపులా నాటుతున్న మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ హనుమంతరావు రోజువారీగా హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ శాఖలకు టార్గెట్ పెట్టారు. అత్యధికంగా డీఆర్‌డీఏ 2 కోట్ల లక్ష్యంగా ఉన్నది. ఇతర శాఖలు కూడా రోజువారీగా మొక్కలు నాటుతూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి.

55.67 లక్షలు నాటిన డీఆర్‌డీఏ..
ప్రభుత్వ శాఖలకు టార్గెట్ విధించగా అత్యధికంగా డీఆర్‌డీఏకు 2 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇచ్చారు. కాగా, బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మొత్తం 55.67 లక్షల మొక్కలు నాటారు. ఇంకా కోటిన్నర మొక్కల వరకు నాటాల్సి ఉన్నది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున ఇంటిపరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటిస్తున్నారు. అటవీశాఖకు 58 లక్షల టార్గెట్ ఉండగా, 2.65 లక్షల మొక్కలు నాటారు. హార్టికల్చర్ 5లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో 7.57 లక్షల మొక్కల టార్గెట్ ఉన్నది. హార్టికల్చర్ శాఖ 1.57 లక్షల మొక్కలు నాటగా, మున్సిపాలిటీల పరిధిలో 700 మొక్కలు మాత్రమే నాటాయి. అయితే కొన్ని శాఖలు ఉత్సాహంగా మొక్కలు నాటుతుండగా, మరికొన్ని శాఖలు ఇంకా హరితహారం కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. టీఎస్‌ఐఐసీ 10లక్షల టార్గెట్ ఉండగా, ఇంకా మొదలు పెట్టలేదు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్ని శాఖలు మొక్కలు నాటడంపై దృష్టి సారించాయి.

రోడ్ల పక్కన మొక్కలకు ట్రీ గార్డులు..
గ్రామాల వద్ద ముఖద్వారం, గ్రామం నుంచి బయటకు వెళ్లే ఇతర రోడ్లకు ఇరువైపులా 6 ఫీట్ల మొక్కలు నాటిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి వారికి సంరక్షణ బాధ్యత అప్పగించారు. జిల్లాలో ప్రధాన పరిశ్రమలు గ్రామాలను హరిత దత్తత పేరుతో దత్తత తీసుకున్నాయి. ఇందులో భాగంగానే మొక్కలకు నీళ్లు పోయడం, మందు వేయించడం, ట్రీగార్డులు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నాయి. గ్రామాల వద్ద రోడ్లకు ఇరువైపులా నాటించడానికి హెచ్‌ఎండీఏ నుంచి 6 ఫీట్ల మొక్కలను తెప్పించి నాటిస్తున్నారు. పరిశ్రమల నుంచి 1.50 లక్షల ట్రీగార్డులు రాగా, వాటిని గ్రామాలకు తరలించారు. ఇబ్బంది లేకుండా రోజువారీగా కలెక్టర్ సమీక్షిస్తున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...