అమీన్‌పూర్... పరిశ్రమల నిధి


Wed,August 14, 2019 12:18 AM

-పారిశ్రామిక హబ్‌తో మారిన రూపురేఖలు
-552 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు కేటాయింపు
-271 ఎకరాల్లో మెడికల్ డివైజ్ పార్క్..
-ముందుకొస్తున్న ఇతర కాలుష్య రహిత పరిశ్రమలు
-ఊపందుకున్న రియల్ వ్యాపారం
-వేగంగా అభివృద్ధి వైపు పరుగులు తీసున్న సుల్తాన్‌పూర్, దాయర
-స్థానికులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు

271 ఎకరాల్లో మెడికల్ డివైజ్ పార్క్...
అమీన్‌పూర్ మండలంలోని సుల్తాన్‌పూర్, దాయర గ్రామాల పరిసరాల్లో ప్రభుత్వం 552 ఎకరాలను పరిశ్రమల స్థాపన కోసం కేటాయించింది. అమీన్‌పూర్ ప్రాంతాన్ని పరిశ్రమల హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెద్దఎత్తున భూకేటాయింపు చేశారు. ఈ భూముల్లో మెడికల్ డివైజ్ పరిశ్రమతో పాటు ఇతర కాలుష్యరహిత పరిశ్రమలు వస్తున్నాయి. వైద్య పరికరాల ఉత్పత్తి పార్క్‌కు 2017లో ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ప్రారంభించి పలువురు పారిశ్రామికవేత్తలకు ధ్రువపత్రాలు కూడా అందించిన విషయం తెలిసిందే. 271 ఎకరాల స్థలంలో మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళా పారిశ్రామికాభివృద్ధి కోసం 51 ఎకరాలు కేటాయించారు. పర్యావరణానికి హాని కలిగించని, కాలుష్యరహిత పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ప్రభుత్వం భూమి కేటాయించడంతో ఇక్కడ టీఎస్‌ఐఐసీ మౌలిక వసతులు కల్పిస్తున్నది. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌కార్పేట్ వేస్తున్న విషయం తెలిసిందే. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులు సులభతరం చేయడంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి చెపుతున్నారు. ఆయా సంస్థలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న 20 పరిశ్రమల నిర్మాణం..
సుల్తాన్‌పూర్ వద్ద ప్రభుత్వం కేటాయించిన మెడికల్ డివైజ్‌పార్క్‌లో వివిధ పరిశ్రమల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 పరిశ్రమలు వేగంగా తమ భవనాల నిర్మాణాలు చేపట్టాయి. డెక్కన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఐఎస్‌సీ (యాష్ ప్యాన్స్), ప్రోమియో తెర్ఫాటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో వైద్య పరికరాల తయారీ కంపెనీ, సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ప్లేక్స్‌డ్ టెక్నో పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా మహిళా పారిశ్రామికాభివృద్ధి కోసం కేటాయించిన 51 ఎకరాల స్థలంలో కూడా పరిశ్రమల నిర్మాణం జరుగుతున్నది. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుండడంతో పరిశ్రమల నిర్మాణం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నది. నిన్నమొన్నటి వరకు నిర్మాణుష్య ప్రాంతంగా ఉన్న సుల్తాన్‌పూర్ పరిసర ప్రాంతాలు ఇప్పుడు నిర్మాణమవుతున్న పరిశ్రమలతో కొత్త రూపు సంతరించుకున్నాయి. కాగా, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు మొత్తం 92 గాను 40 పరిశ్రమలకు అధికారికంగా కేటాయింపులు పూర్తయ్యాయి. అదేవిధంగా ఇతర జనరల్ పరిశ్రమలు 72 కాగా ఇందులో 68 పరిశ్రమలకు కేటాయింపులు చేశారు. అదేవిధంగా 36 మహిళా పరిశ్రమల స్థాపనకు రాగా 32 పరిశ్రమలకు కేటాయింపులు చేశారు. మరో 48 పరిశ్రమలకు కేటాయింపులు జరుగాల్సి ఉన్నదని టీఎస్‌ఐఐసీ అధికారులు చెబుతున్నారు.

ఊపందుకున్న రియల్ వ్యాపారం
అమీన్‌పూర్, సుల్తాన్‌పూర్, దాయర పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రియల్ వ్యాపారం జోరందుకున్నది. కొంది రోజుల వరకు సాధారణ ప్రాంతంగానే ఉండగా మెడికల్ డివైజ్‌పార్క్ నిర్మాణం జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పెద్దసంఖ్యలో రియల్ వ్యాపారులు భూముల కొనుగోలుకు తిరుగుతున్నాయి. రోజువారీగా క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి. భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, వెంచర్లు కూడా వెలుస్తున్నాయి. ఐటీతో పాటు ఇతర ఉద్యోగులు కూడా పరిసరాల్లో ఇండ్ల నిర్మాణానికి భూమి కొంటున్నారు. పరిశ్రమల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనుండడంతో ఇండ్లకు డిమాండ్ ఉంటుందని ఇప్పటి నుంచి రియల్ వ్యాపారులు భూములు కొంటున్నారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టడానికి ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...