ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ


Wed,August 14, 2019 12:15 AM

అందోల్, నమస్తే తెలంగాణ/వట్‌పల్లి: హిందూ సంప్రదాయ పండుగల్లో బంధాలు, బంధుత్వాలు కలిపే రాఖీ పండుగ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. శ్రావణ మాసంలో పూర్ణిమనాడు వచ్చే రాఖీ పండుగను వైభవంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు ఇలా చిన్నా పెద్దా అనే తారతమ్య బేధం లేకుండా ఉత్సాహంగా జరుపుకునేది రాఖీ పండుగ. సోదర, సోదరిమణుల రక్త సంబంధాన్ని కలకాలం నిలిపేది ఈ రక్షాబంధన్ పండుగనే. ఈ పండుగ ఎప్పటి నుంచో హిందూ సంప్రదాయంలో ఉన్నది. ఈ పండుగ రోజున చెల్లెళ్లు అన్నయ్యలకు రాఖీలు కట్టి... వారిపై ఉన్న ఆత్మీయతను చాటి చెబుతారు. రాఖీని కట్టుకున్న సోదరులు బహుమతులతో తమ ప్రేమను చాటుతారు. 15వ తేదీన గురువారం రాఖీపండుగను నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల మార్కెట్‌ల్లో రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక రాఖీ దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేశారు. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రకరకాల రాఖీలు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గురువారం జరుపుకునే రాఖీ పండుగ విశిష్టతపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం...

పండుగ విశిష్టత..
రక్షా బంధనమనేది కేవలం అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు కట్టుకునేది కాదు. రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం అని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగను జరుపుకుంటారు. రాజవంశాల నుంచే ఈ పండుగ ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. రాజవంశీకులకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా, వాటి నుంచి రక్షణ పొందేందుకు కట్టుకునే కట్టునే ఈ రక్షాబంధనం వచ్చినట్లు తెలుస్తోన్నది. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. నేటి యుగంలో అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్లు మాత్రమే రాఖీలను కట్టుకుంటున్నారు. పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలుగాలని సచీదేవి రక్ష కడుతుంది. చరిత్ర విషయానికొస్తే పురుషోత్తముడితో తలపడడానికి సిద్ధంగా ఉన్న అలెగ్జాండర్, విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా బేగం, పురుషోత్తముడి ఆశ్రయం కోరుతుంది. పురుషోత్తముడికి ఆమె, శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కడుతుంది. దీంతో రక్ష కారణంగా అలెగ్జాండర్‌ను చంపకుండా పురుషోత్తముడు వదిలేస్తాడు. కుల, మతాలకు అతీతంగా అనాటి కాలంలోనే అంతటి విశిష్టతను సంపాదించుకున్న రాఖీ పండుగను నేటి యుగంలోనూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

రాఖీ ఎప్పుడు కట్టాలి
సంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షాను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి నాడు మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నోరు తీపి చేయడం సంప్రదాయం. ఇదిలావుండగా పెండ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం మన సంప్రదాయంలో ఆచారమని చెప్పుకొవచ్చు.

సరికొత్త డిజైన్‌ల్లో రాఖీలు
సోదర, సోదరీమణుల్లో రాఖీ లు కొనుగోలు చేసేం దుకు దుకాణాల వద్ద బారులు తీరు తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లోకి కొత్త కొత్త డిజైన్‌లతో కూడిన రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. దూది రాఖీ నుంచి మొదలుకుని స్టోన్‌తో తయారు చేసిన రాఖీలు, వెండి రాఖీలు ఉన్నాయి. స్టోన్ రాఖీలు ఆకట్టుకునే విధంగా మంచి మంచి డిజైన్‌లతో లభ్యమవు తున్నాయి. రూ.2 నుంచి మొదలుకుని రూ. 500 వరకు రాఖీలు అందు బాటులో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జోగిపేట పట్టణంతోపాటు వట్‌పల్లి తదితర మండలాల్లో రాఖీ దుకాణాలు విచ్చలవిడిగా వెలిశాయి. గతంలో బ్యాంగిల్ స్టోర్స్‌ల్లో మాత్రమే రాఖీల విక్రయాలు జరుగగా, ఈ సారి మాత్రం ప్రత్యేకంగా తోపుడు బండ్లపై, దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు.

కిటకిటలాడుతున్న దుకాణాలు
రాఖీ పౌర్ణమి వచ్చిందటే ఇళ్లంతా సందడి సందడిగా ఉంటుంది. చిన్న పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సుల వారు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. గురువారం జరుగనున్న రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో రంగు రంగుల రాఖీ దుకాణాలు భారీగా వెలిశాయి. ఎక్కడా చూసిన రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...