చైన్ స్నాచర్లు దొరికారు..


Mon,August 12, 2019 10:20 PM

అందోల్, నమస్తే తెలంగాణ: జోగిపేట పట్టణంలో సంచలనం రేపిన చైన్‌స్నాచర్లు పట్టుబడ్డారు. పట్టణంలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లతో భయపెట్టించిన దొంగలను ఎట్టకేలకు జోగిపేట పోలీసులు పట్టుకున్నారు. మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాపై పోలీసులు కొన్ని రోజులుగా నిఘా పెంచారు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టి అనుమానం వచ్చిన వారిపై విచారణను చేపట్టారు. ఇం దులో భాగంగా ఆదివారం జోగిపేటలో నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానం వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, జోగిపేటలో చేసిన చైన్‌స్నాచింగ్‌లు తామే చేశామని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం జోగిపేట సీఐ తిరుపతి రాజు తన చాంబర్‌లో ఎస్‌ఐలు వెంకట రాజాగౌడ్, ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జోగిపేటలో చైన్‌స్నాచింగ్ చేసిన ముఠాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బీదర్ పట్టణంలోని ఇరానీగల్లికి చెందిన జాఫర్ అలీ, సత్తాజ్ అలీలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరిని విచారించగా, జోగిపేట పట్టణంతోపాటు జహీరాబాద్, మెదక్, నారాయణఖేడ్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, తాండూరు, బస్వకల్యాణ్ వంటి ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో తెలినట్లు తెలిపారు. సుమారుగా 35 తులాలకు పైగా బంగారం ఆభరణాలను దొచుకెళ్లారని, వీటిని అమ్ముకొని ఖర్చు చేసుకున్నట్లు వారు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. జోగిపేటలో జనవరిలో క్లాక్ టవర్ వద్ద మూడున్నర తులాలు, వాసవీ నగర్‌లో తొమ్మిదిన్నర తులాల బంగారం, కృష్ణవేణి స్కూల్ సమీపంలో మూడు తులాలు, నారాయణఖేడ్‌లో రెండు తులా లు, బస్వకల్యాణ్‌లో రెండు తులాలు తదితర ప్రాం తాల్లో పలు చైన్ స్నాచింగ్‌లు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. ప్రస్తుతం దొరికిన జాఫర్‌తోపాటు నవాబ్‌లు కలిసి గత నెలలో వట్‌పల్లిలోని బ్యాంకు వద్ద మాయమాటలు చెప్పి తప్పుదొవ పట్టించి రూ.15 వేలు అపహరించుకున్నారన్నారు.

వీరితో పాటు పలు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి పరారీలో ఉన్న మమ్ము, మహేశ్ (ఎలియాస్ సోనియా)లను కూడా పట్టుకుంటామని, వారి కోసం గాలింపులు చేపడుతున్నామన్నారు. వీరి వద్ద నుంచి రూ.3 వేల నగదు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నామని, వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు జోగిపేట, వట్‌పల్లి ఎస్‌ఐలు వెంకటరాజాగౌడ్, మోహన్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఏసయ్య, కానిస్టేబుల్ రషీద్‌లు కృషి చేశారని, ఆయన వారిని అభినందించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...