చిన్నరుల్లో ఆనందం


Sun,August 11, 2019 11:15 PM

-ఆపరేషన్ ముస్కాన్‌తో బాలకార్మికులకు విముక్తి
-ఉమ్మడి జిల్లాలో విముక్తి పొందిన662 మంది చిన్నారులు
-368 మందిని తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు
-బడిలో చేరిన 295 మంది చిన్నారులు
-8 మంది అధికారుల బృందంతో తనిఖీలు
సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం బాల కార్మికులను గుర్తించి పనిచేసే చోటు నుంచి విముక్తి కలిగించేందుకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టిన విషయం తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏడాది ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తూ ఉమ్మడి జిల్లాలో 662 మంది చిన్నారులకు అధికారులు విముక్తి కలిగించారు. 8 మందితో ఏర్పాటైన తనిఖీ బృందం హోటళ్లు, బట్టల దుకాణాలు, కిరాణ షాపులు, మటన్ చికెన్ దుకాణాలతో పాటు చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను ముందుగా సేకరించి మూకుమ్మడి దాడి చేసి వారికి రక్షణ కల్పిస్తున్నారు. అధికారుల తనిఖీ బృందానికి చిక్కిన చిన్నారులను స్థానికంగా ఉన్న బాలల పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సెలింగ్ ఇచ్చి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించి స్థానిక పాఠశాలలో చదువుకునేలా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని బాలల సంరక్షణ అధికారులు సూచించారు. అధికారుల తనిఖీల్లో చిక్కిన బాల కార్మికులను 368 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించి చదువుపై ఆసక్తి కలిగిలే బాధ్యత తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఐదు విడుతలుగా జరిగిన ఆపరేషన్ ముస్కాన్‌లో 295మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక ఎస్‌ఐ, న్యాయవాది, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఒకరు, చైల్డ్ లైన్ అధికారితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను ఆపరేషన్ ముస్కాన్‌కు ఏర్పాటు చేశారు. విడివిడిగా బృందం సభ్యులు ముందుగా బాల కార్మికులుగా పనిచేస్తున్న ప్రాంతాల్లో సందర్శించి సమాచారాన్ని సేకరించిన అధికారులు మూకుమ్మడిగా బృందం సభ్యులతో దాడులు నిర్వహించి చిన్నారులకు విముక్తి కల్పించారు.

ఉమ్మడి జిల్లాలో...
జిల్లాల విభజన జరుగకముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం 2015-16 సంవత్సరంలో నిర్వహించి 392 మంది చిన్నారులకు విముక్తి కలిగించి 249 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులు, తల్లిదండ్రులకు స్థానిక బాలల పునరావాస కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పనిచేయడం కన్నా విద్య బుద్ధులు నేర్చుకోవడం మిన్నా అనే అంశాలపై అవగాహన కల్పించడంతో 144 మంది చిన్నారులు చదువుకునేందుకు ఆసక్తి కనబర్చి పాఠశాలల్లో చేరారు. పాఠశాలల్లో చేరిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి విద్యపై కాకుండా ఇతర అంశాలపై దృష్టి పడకుండా చర్యలు తీసుకోవడంతో పిల్లలు చదువుల్లో రాణిస్తున్నారు. పాఠశాలల్లో చేరిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని బడి మానేసిన చిన్నారులకు చైతన్యం కల్పించే బాధ్యత అధికారులు తీసుకోవడంతో ప్రభుత్వ విద్యపై ఆసక్తి పెంచుకుని పాఠశాలకు క్యూ కడుతున్నారు.

జిల్లాలో 270 మందిని గుర్తించిన అధికారులు
జిల్లాల విభజన అనంతరం సంగారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత 2017,18,19 సంవత్సరాల్లో ఆపరేషన్ ముస్కాన్‌లో అధికారులు 270 మంది కార్మికులను గుర్తించారు. పట్టణాల్లోని పలు దుకాణాల్లో పనిచేస్తూ ఆర్థికంగా తల్లిదండ్రులకు సహకరించే విధంగా పిల్లలు కార్మికులుగా మారారని అధికారులు పలు విషయాలను గ్రహించారు. జిల్లాలో తనిఖీల్లో దొరికిన చిన్నారుల్లో 119 మందిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మరో 151 మంది బాల కార్మికులు చదువుకుంటామని అధికారులకు చెప్పడంతో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లల చదువులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. బడిలో చేరిన చిన్నారులు చదువుపై దృష్టి సారించి మంచి ఫలితాలతో ముం దుంటున్నారని ముస్కాన్ అధికారులు తెలిపారు. చదువుకునే వయస్సు ఉన్న పిల్లలను కుటుంబ అవసరాల కోసం తల్లిదండ్రులు పనులకు ప్రోత్సహిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులతో పాటు తల్లిదండ్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆపరేషన్ ముస్కాన్‌లో తనిఖీ బృందాలకు దొరికితే తప్పనిసరిగా బడిలో చేర్పించాలని అధికారులు తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు.

జూలైలో ఆపరేషన్ ముస్కాన్
ప్రతి ఏడాది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం బాల కార్మికులను గుర్తించి విద్యాబుద్ధులు నేర్పించేందుకు జూలై మాసంలో 1 నుంచి 31వరకు నెలరోజుల పాటు ముస్కాన్ తనిఖీ బృందం సభ్యులు మురికి వాడలు, దుకాణ సముదాయాలు, చిన్నచిన్న పరిశ్రమల్లో పరిశీలించి కార్మికులను గుర్తించే పనిలో ఉంటారు. అధికారుల దృష్టికి వచ్చిన బాల కార్మికుల వివరాలను పూర్తిగా తెలుసుకుని, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసి తనిఖీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. చదువుపై ఉన్న చిన్నారుల అభిప్రాయాలను తెలుసుకుని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి చదువుకునేందుకు అనువైన వసతులను కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులను పనిలో పెట్టేందుకు తల్లిదండ్రులు సైతం భయపడి బడికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్‌లో రాణించాలని ముస్కాన్ అధికారులు ప్రోత్సహిస్తున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...