జిల్లాకు జాతీయ అవార్డు


Sat,August 10, 2019 11:31 PM

-ఫలించిన కలెక్టర్ హనుమంతరావు కృషి
-23న న్యూఢిల్లీలో అవార్డును అందుకోనున్న కలెక్టర్
-కార్యక్రమంలో భాగస్వాములైన ఐసీడీఎస్, డీపీవో, డీఆర్డీవోలు
సంగారెడ్డి చౌరస్తా: పోషణ్ అభియాన్ కింద 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డి ఎంపికైంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పోషణ లోపం లేని సమాజ నిర్మాణం కోసం కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలన్ని చైతన్యం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇమ్యూనైజేషన్ శాఖల సమన్వయంతో కలెక్టర్ చేసిన కృషి ఫలించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల నుంచి 149 ప్రాజెక్టులు అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపించంగా, అందులో జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపిక కావడం గర్వకారణం. కలెక్టర్‌తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులందరూ ఈ నెల 23న న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌ల్లో నిర్వహించే కార్యక్రమంలో పోషణ్ అభియాన్ అవార్డులను అందుకోనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావుతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి మోతీ, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోజీరాం రాథోడ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ గాయత్రీదేవిలకు ఆహ్వానం అందింది.

పోషణ్ అభియాన్ అనగా...
ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఒక ఉద్యమమే పోషణ్ అభియాన్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, పాఠశాల కమిటీలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచులు, ప్రజా సంఘాలు విస్తృతంగా పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపేందుకు కార్యచరణ చేశారు. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌కు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. అందుకే ఆ నె లను జాతీయ పోషకాహార మాసంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చూచించిన విధంగా జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అందుకోసం పోషణలో పంలేని తెలంగాణకావాలనే నినాదాన్ని ఎత్తుకున్నారు.

పోషణ్ అభియాన్‌తో ప్రయోజనం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోషణ్ అభియాన్ వెనుక బలమైన కారణం ఉన్నది. దేశ వ్యాప్తంగా పోషణ లోపం, రక్త హీనత, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఇందుకోసం కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే పరిపూర్ణమైన లక్ష్యం ఇంకా చేరుకోవాల్సి ఉన్నందున జన పోషణ్ టెక్నాలజీ సహాయంతో లబ్ధిదారులకు శ్రేష్టమైన ఆహారాన్ని అందించేలా పోషణ్ అభియాన్ చేస్తుంది. అయితే జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జన చైతన్యం కోసం పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలందరూ భాగస్వాములను చేయడం ముఖ్య ఉద్దేశం. దీంతో శక్తవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు గట్టి పునాది ఏర్పాడుతుందని ప్రభుత్వ విశ్వాసం. ముఖ్యంగా పోషణ్ అభియాన్‌తో గర్భవతులు, బాలింతలు, శిశువులు, కౌమార బాలికలు, చిన్నారులకు ప్రయోజనం చేకూరుతున్నది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...