మన లక్ష్యం 26 లక్షలు..


Fri,August 9, 2019 10:58 PM

-ప్రతి మండలానికి లక్ష టార్గెట్
-హరి(త)దాస్‌పూర్ కావాలి
-ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం
-నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి
-కలెక్టర్ హనుమంతరావు
-గ్రామాన్ని దత్తత తీసుకున్న డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు
-హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి
కొండాపూర్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన హరిహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలంలోని హరిదాస్‌పూర్, తమ్మలబాయి తండాలో రోడ్డుకు ఇరువైపుల మెగా ప్లాంటేషన్ డేను పురస్కరించుకుని కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హరితే రక్ష అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలానికి ఒక లక్ష చొప్పున మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. మన లక్ష్యం ఒక లక్ష మొక్కలు నాటి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలువాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. హరిదాస్‌పూర్ గ్రామాన్ని మండలంలోనే ఒక రోల్ మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. స్థానిక సర్పంచ్ షఫీ ఆ గ్రామ యువకులతో గ్రామానికి సంబంధించి 11 రకాల కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాన్ని అభివృద్దిలో తీసుకుపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కలెక్టర్ సూచనల మేరకు డీఆర్‌డీవో పీడీ శ్రీనివాసరావు హరిదాస్‌పూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలల్లో రోడ్డుకు ఇరువైపుల, ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒకొక్క మండలానికి లక్ష మొక్కలను నాటి వాటిని సంరక్షించినప్పుడే మన లక్ష్యం నెరవేరినట్టవుతుందన్నారు. మండలంలోని ప్రతి గ్రామం ఒక స్మృతివనం కావాలని, అలాంటప్పుడే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుతామన్నారు. జిల్లాలో 26 మండలాలు ఉన్నాయని, ప్రతి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మండలానికి లక్ష మొక్కలు నాటితే 26 లక్షల మొక్కలతో విజయవంతంగా హరితహారాన్ని పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడు గుంతలు, స్వచ్ఛ భారత్, పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలను నిర్మించుకునేందుకు జాతీయ గ్రామీణ ఉపాధీ హామి పథకంలో డబ్బులు ఉన్నాయని, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100 శాతం అక్షరాస్యత గ్రామాలుగా కొండాపూర్ మండలం కావాలన్నారు.

ఏఒక్క అధికారికి లంచం ఇవ్వొద్దు...
ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. రైతులకు సంబంధించి అధికారులు వారిని ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. హరిదాస్‌పూర్ గ్రామంలో త్వరలో రైతుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు భూవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెంటనే పట్టాపాసు పుస్తకాలను అందిస్తామన్నారు. ఈనెల 13వ తేదీన తహసీల్దార్ బలరాం గ్రామంలో భూవాణి కార్యక్రమం నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు, భూముల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. పట్టా పాసు పుస్తకాలను పట్వారి రైతుల ఇంటికే వచ్చి అందజేస్తారన్నారు. హరిదాస్‌పూర్ గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ షఫీమియా, ఎంపీపీ పి.మనోజ్‌రెడ్డి, డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్‌రావు, ఏడీఆర్‌డీవో శ్రీనివాస్, ఏపీడీ ఎల్లయ్య, ఎంపీడీవో స్వప్న, తహసీల్దార్ బలరాముడు, ఎంపీటీసీ లక్ష్మి కిషన్, ఏపీఎం వీరప్ప, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...