చింతమడక ముస్తాబు


Sat,July 20, 2019 11:41 PM

-రేపు స్వగ్రామానికి సీఎం కేసీఆర్
-పకడ్బందీ ఏర్పాట్లు.. సభా వేదిక సిద్ధం
-గ్రామంలో పండుగ వాతావరణం
-గ్రామస్తులకు ప్రత్యేక ఐడీ కార్డులు
-కలెక్టర్‌తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) చింతమడక గ్రామానికి రానుండడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. దీం తో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజ లు సంబురంతో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు గ్రామానికి చేరుకొని సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటారు. చిన్ననాటి మిత్రులు, ఆత్మీయులతో సమావేశమవుతారు. గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. శనివారం సాయంత్రం మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జేసీ పద్మాకర్, సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరి, గ్రామ సర్పంచ్ హంసకేతన్‌రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు దిశానిర్దేశం చేశారు. కాగా, గ్రామంలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్లను సీఎం ప్రారంభించడంతో పాటు బీసీ గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నా రు. గ్రామంలో కలియతిరగనున్నారు. గ్రామస్తులందరికీ ప్ర త్యేకంగా ఐడీ కార్డులను తయారు చేశారు. కుటుంబ సమగ్ర సర్వే చేసిన అధికార బృందం ఇంటింటికీ వెళ్లి వారికి ఐడీ కా ర్డులను అందజేయనున్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్ర త్యేక అధికారిని నియమించారు. వారి నేతృత్వంలో ఐడీ కార్డు లు అందజేయడంతో పాటు వారిని మీటింగ్‌కు తీసుకెళ్లడం, మీటింగ్ అనంతరం దగ్గరుండి వారికి భోజనాలు చేయిస్తారు. వర్షాకాలం కావడంతో రేయిన్‌ప్రూఫ్ టెంట్లను వేస్తున్నారు. ఇప్పటికే టెంట్ల పనులు పూర్తయ్యాయి. వేదిక, ఇతరత్రా పనులు పూర్తి చేశారు. సీఎంతో పాటు తన ఆత్మీయులతో కలి సి భోజనం చేయడానికి ప్రత్యేకంగా టెంట్లు వేశారు. పెద్దమ్మ గుడిని రంగులతో అలంకరించారు. చింతచెట్టు వద్ద ప్రత్యేకం గా గద్దెను నిర్మించారు. పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.

చింతమడకతో సీఎం కేసీఆర్‌కు అవినాభావ సంబంధం : ఎమ్మెల్యే హరీశ్‌రావు
సీఎం కేసీఆర్‌కు చింతమడకతో అవినాభావ సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎంత ఉన్నత స్థాయికి వెళ్లిన చింతమడక ప్రజలతో ఆత్మీయ, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రామ బిడ్డగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి రెండోసారి సీఎం కావడంతో చింతమడక గ్రామస్తులు గర్వపడుతున్నారన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సహాయం అందిస్తారనే విశ్వాసంతో గ్రామస్తులు ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, కరువు మంత్రిగా పని చేస్తున్నప్పుడు గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేశారన్నారు. ఓ రైతు బిడ్డగా ఈ గ్రామ ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గ్రామస్తులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారన్నారు. వర్షం పడితే సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో, వర్షం లేకుంటే హెలీక్యాప్టర్‌లో వస్తారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామంలో వీధులన్నీ కలియతిరగడంతో పాటు దేవాలయాలను సీఎం కేసీఆర్ సందర్శిస్తారన్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 22న ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తన పురిటిగడ్డ చింతమడకకు రానున్నారన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో దసరా, దీపావళి, ఉగాది పండుగలు ఒకేసారి జరుగుతున్న వాతావరణం ఉందన్నారు. సీఎం కేసీఆర్ చింతమడక పర్యటనకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. తన పర్యటనలో భాగంగా తన సన్నిహితులు, స్నేహితులు, ప్రజలతో ఆత్మీయంగా గడిపి వారితో కలిసి భోజనం చేస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ చింతమడక ప్రజల కోరికలన్నీ తీర్చనున్నారన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వారం రోజులుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇది కేవలం తన సొంత గ్రామస్తులతో సీఎం కేసీఆర్ మమేకమయ్యే పర్యటన అయినందున ఇతరులు వచ్చి ఇబ్బంది పెట్టొద్దన్నారు. త్వరలో సిద్దిపేటకు సీఎం కేసీఆర్ మరోసారి రాబోతున్నారని, అప్పుడు అందరికీ అవకాశం ఉంటుందన్నారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు : సీపీ జోయల్ డెవిస్
సీఎం కేసీఆర్ చింతమడక పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించామని, ముగ్గురు అడిషనల్ ఎస్‌పీలు, ముగ్గురు ఏసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 32మంది సీఐలు, 74 మంది ఎస్‌ఐలు, 64 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 635మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 75 మంది మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు, స్పెషల్ పార్టీ, రోప్ పార్టీస్, బీడీ టీమ్స్, డాగ్ స్కాడ్స్, సెక్యూరిటీ వింగ్, మఫ్టీ పార్టీ మొత్తం 1050 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు సీపీ జోయల్ డెవిస్ చింతమడక గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...