ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ ధ్యేయం


Sat,July 20, 2019 11:38 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ మొదలుకుని టీఆర్‌ఎస్ కార్యకర్తల వరకు పేదల బాగుకోసం పరితపిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్‌లోని రహమాన్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పెంచిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిందన్నారు. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమమే ఆసరా పింఛన్ల పంపిణీ అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో కేవలం 6వేల పింఛన్లకు రూ.12లక్షలు మాత్రమే పంపిణీ చేయగా కేసీఆర్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో 26వేల పింఛన్లకు గాను రూ.2.69 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, పెంచిన పింఛన్లతో ఆ మొత్తం రూ.5.71 కోట్లకు పైగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే ఖేడ్ పట్టణాభివృద్ధి..
నారాయణఖేడ్‌ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో నెలకొన్న సమస్యలను, ప్రజావసరాలను గుర్తించి అందుకనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మూడేండ్లుగా దశలవారీగా రూ.4కోట్ల నిధులతో సీసీరోడ్లు, అంతర్గత రోడ్లు వేయగా ప్రస్తుతం మరో రూ.11.04 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, మురికి కాలువల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో నివసిస్తున్న అన్నివర్గాల ప్రజల మనోభావాలను గౌరవించి లింగాయత్ సహా అన్ని కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలను నిర్మించినట్లు చెప్పారు. ఖేడ్‌ను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వంద పడకల దవాఖానతో పాటు 50 పడకల మాతాశిశు సంక్షమ దవాఖాన, విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణవాసుల కోసం జూకల్ శివారులో 800ల డబుల్ బెడ్‌రూం ఇండ్లు సిద్ధమవుతున్నాయన్నారు.

మందిర నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు
నారాయణఖేడ్ పట్టణంలో వంద ఏండ్ల చరిత్ర గల రామమందిరాన్ని కాంగ్రెస్ నాయకులు పునరుద్ధరణ పేరిట కూల్చివేసి అసంపూర్తిగా వదిలేస్తే ఇటీవల తాను ఆలయాన్ని సందర్శించి ఉన్నతాధికారుల ద్వారా రూ.3 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయించి ప్రభుత్వానికి సమర్పించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. రామాలయానికి సంబంధించిన 44 ఎకరాల లెక్క పత్రం లేకుండా చేశారని, అన్యాక్రాతమవుతున్న వక్ఫ్‌బోర్డు భూములను పరిరక్షించే చర్యల్లో భాగంగా సర్వే చేయించడం జరిగిందన్నారు. అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఆయా ఆస్తుల పరిరక్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈద్గాల అభివృద్ధికి, మైనార్టీ శ్మశానవాటిక ప్రహరీ నిర్మాణానికి సైతం గతంలో నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామిరెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు చాందిబాయి, సంగీత, మహిపాల్‌రెడ్డి, సుశీల, మోతీబాయి, జంగం శ్రీనివాస్, జయశ్రీలు, జడ్పీటీసీలు లక్ష్మీబాయి, లలిత, పుష్పాబాయి, నర్సింహారెడ్డి, విజయరామరాజు, రాజురాథోడ్, రాఘవరెడ్డి, ఐకేపీ డీపీఎం జయశ్రీరాజ్, ఎంపీడీవో వీరబ్రహ్మచారి, మున్సిపల్ కార్యాలయ మేనేజర్ వాసంతి తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...