లాభాల బాటలో ఆర్టీసీ మెదక్ రీజియన్


Sat,July 20, 2019 12:38 AM

సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ మెదక్ రీజియన్ లాభాల బాటలో పయనిస్తున్నది. గత సంవత్సరం రూ.7.40 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి నష్టాలను తగ్గిస్తూ రాగా, జూన్ నెలలో మెదక్ రీజియన్ పరిధిలో ఉన్న ఆర్టీసీ రూ.36 లక్షల లాభాలను ఆర్జించింది. ఏరోజుకారోజు డీజిల్ ధరలు పెరుగుతున్న సంస్థ నిర్దేశించిన ఆక్యూపెన్సీ (బస్సుల్లో ప్రయాణికులను పెంచడం వల్ల) సాధించడం, 17 శాతం ఐఆర్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. అదేవిధంగా కిలోమీటర్ ఎర్నింగ్ సాధించి సమన్వయంతో లాభాల బాటలోకి మెదక్ రీజియన్‌ను తీసుకువచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్సుడిపోలు మొత్తం మెదక్ రీజియన్ పరిధిలోకి వస్తాయి. మెదక్ రీజియన్ పరిధిలో జూన్ నెలలో రూ.36 లక్షలు లాభం సాధించి ఆదర్శంగా నిలిచింది. మెదక్ రీజియన్ పరిధిలో మొత్తం 674 బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు 493, ప్రైవేట్ అద్దె బస్సులు 181 ఉన్నాయి.

రీజియన్ పరిధిలో మెదక్ డిపోలో 102 బస్సులు, నారాయణఖేడ్‌లో 67, సంగారెడ్డిలో 120, జహీరాబాద్‌లో 98, సిద్దిపేటలో 118, గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో 74 బస్సులు, దుబ్బాకలో 42, హుస్నాబాద్‌లో 53 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు ప్రతి రోజు 258 రూట్లలో సేవలు అందిస్తున్నాయి. ప్రతిరోజు 2.5లక్షల కిలోమీటర్లలో ప్రయాణికులకు సేవలందిస్తూ రోజుకు రూ.75 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. మెదక్ రీజియన్ పరిధిలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నది. సమయానికి బస్సులను నడుపుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కండక్టర్, డ్రైవర్లు సమన్వయంతో పనిచేస్తూ సంస్థను లాభాల బాటలో ఉంచేందుకు నిరంతరం పనిచేస్తున్నారు. మెదక్ రీజియన్ పరిధిలో 150 మంది డ్రైవర్ల కొరత ఉన్నది. డ్రైవర్ల కొరత ఉన్నప్పటికీ డ్రైవర్లు డబుల్ డ్యూటీలు చేస్తూ సంస్థ లాభాల కోసం ప్రయత్నిస్తున్నారు. అందరి సమన్వయంతోనే జూన్ నెలలో మెదక్ రీజియన్ రూ.36 లక్షల లాభం సాధించింది.

సంస్థ మరింత లాభాల్లోకి వెళ్లేందుకు చర్యలు
మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీని మరింత లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే రీజియన్ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఇతరులకు కాంట్రాక్టు పద్ధతిని అప్పగించి వచ్చిన డబ్బులను సంస్థ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి, కంగ్టి, సిద్దిపేటలలో ఒక్కో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి వచ్చిన డబ్బులను సంస్థ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అదేవిధంగా నర్సాపూర్‌లో పెట్రోల్ బంకు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఆర్టీసీ బస్ డిపోలు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాప్లెక్స్‌లు, మినీ థియోటర్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా వాటిని నిర్మించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రారంభించిన పెట్రోల్ బంకులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా నేరుగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించి లాభాలను పూర్తిగా తమకే చెందేలా ఆర్టీసీ ఆర్‌ఎం ఉన్నతాధికారులకు నివేదికలను అందజేశారు.

విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు
ప్రతి రోజు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ పాఠశాల విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత బస్ పాసులను అందజేసింది. పాఠశాల విద్యార్థులు బాలురకు 12 సంవత్సరాలోపు విద్యార్థులకు, బాలికలకు 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉచిత బస్‌పాసులను అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి బస్‌పాసులు అందించాలని ఆర్టీసీ యాజమాన్యం గ్రామాల్లోకి వెళ్లి అర్హులైన విద్యార్థులకు రూ.30 తీసుకుని బస్సుపాసులను అందిస్తున్నారు. గత సంవత్సరం 8,300 మంది విద్యార్థులకు బస్‌పాసులను అందించగా ఈ సంవత్సరం గ్రామాల్లోకి ఆర్టీసీ సిబ్బంది అందించడంతో 16 వేలకు చేరుకున్నది. అదేవిధంగా దివ్యాంగులకు గత సంవత్సరం 7,700 మంది బస్‌పాసులు అందించగా, ఈ సంవత్సరం 13 వేల ఉచిత బస్‌పాసులు అందించారు. ఉచిత బస్‌పాసులన్నింటికీ ప్రభుత్వం నేరుగా ఆర్టీసీ రాయితీని అందిస్తున్నది. ప్రభుత్వం రాయితీ ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఇంకా దివ్యాంగులకు మరో 10వేల పాసులు అందించనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...