మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తా


Thu,July 18, 2019 03:21 AM

అందోల్, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హామీనిచ్చారు. బుధవారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరు మాసాల వేతనాలు చెల్లించాలని కమిషనర్‌కు అడిగామని, వారం పదిరోజుల్లో వేతనాలను ఇస్తానని మంగళవారం చెప్పారన్నారు. బుధవారం ఉదయం విధుల్లోకి వెళ్తే పనులను చేపట్టొద్దని ఆదేశించారని, ఇదేమని అడిగితే వేతనాలను చెల్లించిన తర్వాత చూద్దామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, పోలీసులను పిలిపించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్పందించి తాను కమిషనర్‌తో మాట్లాడుతానని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తానని ఆయన హామీనిచ్చారు. అంతకుముందు మున్సిపల్ సిబ్బందిని విధుల్లోకి రావొద్దని చెప్పడంతో కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. కమిషనర్ మిర్జా ఫసహాత్ అలీబేగ్‌తో వాగ్వాదానికి దిగారు. విష యం తెలుసుకున్న జోగిపేట ఎస్‌ఐ వెంకట రాజాగౌడ్ కార్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు. పనులకు రావొద్దని, మీ బకాయి డబ్బులను మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెల్లిస్తానని చెప్పడంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ను వేతనాల కోసం అడిగితే ప్రస్తుతానికి ఖాతాలో డబ్బులు లేవని చేతులెత్తేయడంతో కార్మికులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు.

వేతనాలను చెల్లించేందుకు ఇబ్బందులు : కమిషనర్
మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికులకు వేతనాలను చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కమిషనర్ మిర్జా ఫసహాత్ అలీబేగ్ తెలిపారు. అవుట్ సోర్సింగ్ కింద 76మంది పనిచేస్తుండగా, ఒక్కోక్కరికి నెలకు రూ.12వేలు కాగా, నెలకు రూ.9.12 లక్షలను వేతనాలను ఇవ్వాల్సి ఉంది. మున్సిపాలిటీ వార్షిక ఆదాయం రూ.90 లక్షలు ఉండగా, సిబ్బందికి ఏడాదికి రూ.కోటిపైన వేతనాలను చెల్లించాల్సి వస్తుందని, దీంతో వేతనాలను చెల్లించేందుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...