సఖి కేంద్రం సేవలపై అవగాహన కల్పించాలి


Wed,July 17, 2019 12:28 AM

సంగారెడ్డి టౌన్ : సఖి కేంద్రంలో అందుతున్న సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులు, వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సఖి కేంద్రం మహిళలు, బాలికలు ఎదుర్కొనే వివిధ రకాల వేదింపులు, హింసల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, సఖి కేంద్రం సేవలపై జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించాలని సఖి కేంద్ర సభ్యులు వసంత, పవనరేఖలకు వివరించారు. ఈ సఖి కేంద్రంలో వేదింపులు ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలకు ముఖ్యంగా 5 రకాల సేవలు కౌన్సెలింగ్, న్యాయసేవలు, పోలీసు సహాయం, మెడికల్ సేవలు, తాత్కాలిక వసతి వంటి సేవలను అందిస్తున్నామన్నారు. ఎవరైనా వేదింపులకు గురవుతున్న మహిళలు సఖి టోల్ ఫ్రీ నెంబర్ 181కు కాల్ చేసి సహాయాన్ని పొందవచ్చని, ఈ వివరాలను గ్రామీణ ప్రజలకు చేరేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు జరుగడానికి కారణాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలీసుస్టేషన్‌లో పెట్రోలింగ్, బ్ల్యూకోల్ట్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించే విధంగా ప్రతి పోలీస్‌స్టేషన్ అధికారి ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. పోలీసు శాఖలో వస్తున్న నూతన సాంకేతికతను పోలీసు స్టేషన్‌లో ఉన్న ప్రతి పోలీసు అధికారి సమర్థవంతంగా ఉపయోగపడేలా ప్రతి శనివారం శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లలో 5 ఎస్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తరచుగా నేరాలకు పాల్పడే నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీలు శ్రీధర్‌రెడ్డి, సత్యనారాయణ రాజు, గణపతి జాదవ్, రాజేశ్వర్‌రావు, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్ నాయుడు, అన్ని సబ్ డివిజన్‌ల సీఐలు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...