సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి


Tue,July 16, 2019 03:45 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో గ్రామంలో సభ సమావేశం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చింతమడకలో సోమవారం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డితో కలిసి సుమారు 2 గంటల పాటు గ్రామంలో వాడవాడతో శివారు ప్రాంతం సభ సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు. చింతమడక గ్రామంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న బీసీ గురుకుల పాఠశాల వసతి గృహ స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో పలు చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్, సర్పంచుతో చర్చించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, సభ సమావేశం జరిగే స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐకేపీ గోదాము సీసీ ప్లాట్‌ఫాం వద్ద సభ సమావేశం జరిపి, దాదాపు 3200 మంది గ్రామస్తులను అనుమతించేలా కుర్చీలను ఏర్పాటు చేయాలని, 200 కుర్చీలు అధికారులకు, మరో 200 కుర్చీలతో ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణం మొత్తం రెయిన్ ప్రూఫ్‌తో ఉండాలని నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు. పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో వన భోజనాలు చేసే స్థల ఏర్పాట్లపై పరిశీలన చేస్తూ ఆలయం పక్కనున్న చింత చెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేసే ఏర్పాట్లు, ఖాళీ స్థలంలో గ్రామస్తులందరు భోజనం చేసే విధంగా జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఏసీపీ రామేశ్వర్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డితో చర్చించారు. వన భోజనాలు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, డీపీవో సురేశ్‌బాబు, వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, హౌసింగ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ, రూరల్ మండల తహసీల్దార్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బాలకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...