సమస్యల పరిష్కారానికి సాంకేతికతను జోడించాలి


Tue,June 18, 2019 11:16 PM

-రైతుల కోసం ఫోన్‌ ఇన్‌ నిర్వహించాలి
-నకిలీ విత్తనాలు, ఎరువుల కంపెనీలపై నిఘా పెంచాలి
-కలెక్టర్‌ హనుమంతరావు
సంగారెడ్డి చౌరస్తా: రైతులు పండించే పంటలకు సంబంధించిన ప్రతి సమస్యకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పరిష్కరించే వేదిక కావాలని కలెక్టర్‌ ఎం. హనుమంతరావు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ)కు పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పాలక మండలి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంటలు, విత్తనాలు, ఎరువులు తదితర విషయాలపై సరైన సూచనలు ప్రతి రైతుకు చేరాలని సూచించారు. ఏఈవోల ద్వారా క్రమంగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జిల్లాలో భూములు ఏ పంటలకు అనువైనవో, ఏ పంటలు వేసుకోవాలి, ఏ విత్తనాలు వాడాలి, దిగుబడి ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో ధర ఏ విధంగా లభిస్తుందన్న విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అనుబంధ శాఖలన్ని రైతులకు అవసరమైన సాంకేతికతను అందించడంతో పాటు ఆయా శాఖల ద్వారా అందిస్తున్న సబ్సిడీలు, యంత్ర పరికరాలు, ప్రత్యామ్నాయ పంటలు తదితర విషయాలను విడమరిచి చెప్పాలని సూచించారు.

ఫోన్‌ ఇన్‌ నిర్వహించండి
వ్యవసాయాధికారులు, సైంటిస్టులు కలిసి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఏఈవోలకు శిక్షణ ఇవ్వాలని సైంటిస్టులకు సూచించారు. గ్రాస్‌ లెవల్‌లో విజయవంతం కావడానికి క్షేత్ర పరిధి తనిఖీలు ఉండాలని, అగ్రి క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని, సమావేశాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేయాలన్నారు. పంటల వారీగా గత సంవత్సరంలో వచ్చిన సమస్యలను తెలుసుకుని ఈ సంవత్సరం అవి రాకుండా విశ్లేషణ చేసి సరైన సూచనలు రైతులకు అందజేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని విషయాలలో సైంటిస్టులు కావాలన్నారు. అందుబాటులో ఉండే విధంగా మెకానిజం తీసుకురావాలని సూచించారు. క్షేత్ర పరిధిలో రైతుల పరిస్థితులను సమీక్షించాలన్నారు.

రానున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అనువైన పరికరాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. రైతులు పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టాలని, రైతులే మిల్లింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలన్ని సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలని, ఎరువులు, విత్తనాల కంపెనీలపై నిఘా పెట్టాలని సూచించారు. రైతులకు మేలు చేసే విధంగా వ్యవహారించాలని వివరించారు. అంతకుముందు జిల్లా వ్యవసాయాధికారి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆత్మ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, నాబార్డు ఏజీఎం, ఎల్‌డీఎం, డాట్‌ సెంటర్‌ సైంటిస్టులు, ఆత్మకమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...